కోహ్లీ అర్ధశతకం వృధా…
1 min read
AAB NEWS : ఆస్ట్రేలియా గడ్డపై భారత విజయాలకు బ్రేక్ పడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(85; 60 బంతుల్లో 4పోర్లు, 3 సిక్సర్లు) పోరాడిన సిడ్ని వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. విరాట్ తోడుగా మరో బ్యాట్స్‌మెన్ రాణించకపోవడం.. చెత్త ఫీల్డింగ్ భారత్ విజయావకాశాలను దెబ్బతీశాయి. మరోవైపు సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. 187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(0) సిల్వర్ డక్‌గా పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచాడు. మాక్సవెల్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(28)తో కలిసిన కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం ధావన్‌ను స్వెప్సన్ ఔట్ చేశాడు. మరో వైపు కోహ్లీ ధాటిగా ఆడుతూ.. అర్థశతాకాన్ని పూర్తిచేసుకున్నాడు.
ఆ వెంటనే స్వెప్సన్ ఒకే ఓవర్లో సంజూ శాంసన్(10), అయ్యర్(0)ను ఔట్ చేసి భారత్ ను గట్టి దెబ్బకొట్టాడు. ఇక క్రీజులోకి వచ్చిన పాండ్యాతో కోహ్లీ జట్టును విజయం దిశగా నడిపించాడు. భారీ షాట్లు ఆడుతూ ఆశలు రేకెత్తించాడు. వరుస బౌండరీలతో జోరు కనబర్చిన హార్దిక్ పాండ్యా(20) జంపా బౌలింగ్‌లో ఫించ్‌కు చిక్కి వెనుదిరిగాడు.
మరికొద్దిసేపటికే భారీ షాట్‌కు యత్నించిన విరాట్.. ఆడమ్ సామ్స్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. దీంతో భారత ఓటమి ఖరారైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేసింది.
ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్వేపన్ 3, మ్యాక్స్‌వెల్, అండ్రూ టై, జంపా, అబాట్ తలా ఒక వికెట్ తీశారు. ఆసీస్ భారీ స్కోర్.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మాథ్యూ వేడ్ (80; 53 బంతుల్లో 7పోర్లు, 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (54; 36 బంతుల్లో 3 పోర్లు, 3 సిక్సర్లు) లు అర్థశతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ శుభారంభం దక్కలేదు.
14 పరుగుల వద్దే ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్(0)ను వాషింగ్టన్ సుందర్ తన తొలి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. వన్ డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్(24; 23 బంతుల్లో 1 పోర్)తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ చెలరేగి ఆడాడు. బంతిని బౌండరీని దాటించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు.
అతడికి స్టీవ్ స్మిత్ చక్కని సహకారం అందించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు 65 పరుగులు జోడించారు. సుందర్ మరోసారి మాయ చేసి స్మిత్‌ను ఔట్ చేశాడు. అగ్నికి వాయువు తోడైనట్లు వేడ్ కు మాక్స్ వెల్ జతకలిశాడు.
ఇద్దరూ ఎడా పెడా బౌండరీలు బాదుతూ.. అర్థశతకాలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్ కు 90 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే క్రమంలో వీరిద్దరు ఔటైనా.. చివర్లో హెన్రిక్స్ (5; 2 బంతుల్లో 1 పోర్), షార్ట్ (7; 3 బంతుల్లో 1 పోర్) ధాటిగా ఆడడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. భారత బౌలర్లలో సుందర్ 2, నటరాజన్, ఠాకూర్లు చెరో వికెట్ తీశారు.
80 Total Views, 2 Views Today