హార్దిక్, జడేజా విధ్వంసం…
1 min read
AAB NEWS : ఆఖర్లో హార్దిక్ పాండ్య (92; 76 బంతుల్లో, 7×4, 1×6), రవీంద్ర జడేజా (66; 50 బంతుల్లో, 5×4, 3×6) విధ్వంసం సృష్టించడంతో ఆస్ట్రేలియాకు భారత్ 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ (63; 78 బంతుల్లో, 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. కోహ్లీసేనకు శుభారంభం దక్కలేదు. నాలుగో ఓవర్లో లైఫ్ లభించినా ధావన్ (16; 27 బంతుల్లో, 2×4) అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. అబాట్ బౌలింగ్‌లో పేలవ షాట్‌తో పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ.. శుభ్‌మన్ గిల్ (33; 39 బంతుల్లో, 3×4, 1×6) తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత వేగంగా పరుగులు సాధించింది. అయితే గిల్‌ను అగర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుని స్కోరుబోర్డుకు బ్రేక్‌లు వేశాడు.
హార్దిక్-జడేజా 150 పరుగుల భాగస్వామ్యం
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (19), కేఎల్ రాహుల్ (5) స్పిన్నర్లు జంపా, ఆగర్ ధాటికి ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఆసీస్ స్పిన్నర్లు స్కోరును కట్టడిచేశారు. మరోవైపు కోహ్లీ అడపాదడపా బౌండరీలతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించసాగాడు. ఈ క్రమంలో 62 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే కోహ్లీని హేజిల్‌వుడ్ మరోసారి బోల్తాకొట్టించడంతో 152 పరుగులకే భారత్ సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో హార్దిక్ పాండ్య, జడేజా జట్టును ఆదుకున్నారు. మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆఖర్లో బౌండరీలతో హోరెత్తించారు. ఆసీస్ బౌలర్లకు అవకాశమివ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆరో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసీస్‌పై ఆరో వికెట్‌కు హార్దిక్-జడేజా (150 పరుగులు) భాగస్వామ్యమే అత్యధికం. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆగర్ రెండు, జంపా, అబాట్, హేజిల్‌వుడ్ తలో వికెట్ తీశారు.
34 Total Views, 2 Views Today