AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

‘తలైవా’ తలరాత మారుస్తాడా…?

1 min read

AAB NEWS : రజనీకాంత్ తమిళనాడులోనే కాదు.. దక్షిణాదిలోనే సూపర్ స్టార్. ఆ మాటకొస్తే దేశం వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న కొద్దిమంది హీరోల్లో ఒకరు. రజనీ డైలాగ్ చెప్తే ఫాన్స్ ఊగిపోతారు. ఆ స్టైల్ కి వెర్రెత్తిపోతారు. దశాబ్దాలుగా కోట్లాది అభిమానులను సాధించుకున్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడనే మాట ఇప్పటిది కాదు. 1996 నుంచి అంటే పాతికేళ్ల పైగా వినిపిస్తూనే ఉంది. ఆ ఎన్నికలు, ఈ ఎన్నికలు అనుకుంటూ దశాబ్దాలు గడుస్తున్నాయి. కానీ, రజనీకాంత్ బాల్కనీలోకొచ్చి అభిమానులకు చేతులు ఊపటం, ఫంక్షన్ హాల్లో మీటింగులు పెట్టడం తప్ప ఈ దిశగా సాధించింది పెద్దగా లేదు. రజనీ రాజకీయాల్లో వస్తారా? లేదా? అనే చర్చ ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ ఉత్కంఠకు ఎట్టకేలకు మూడేళ్ల కింద రజనీ తెర దించారు.కానీ దాన్ని ఆచరణలోకి మాత్రం ఇప్పటికి తీసుకొచ్చాడు.

2017 డిసెంబరులో 5 రోజులపాటు అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ చివరిరోజున.. అరసియల్‌ కు వరువదు ఉరుది అంటే రాజకీయాల్లోకి రావడం ఖాయం అని బహిరంగంగా ప్రకటించారు. రాజకీయాల్లో సిస్టమ్ సరిగ్గా లేదు, దాన్ని మారుద్దాం..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లో పోటీచేస్తాం అని వ్యాఖ్యానించారు. అభిమాన సంఘాలను మక్కల్ మన్రాలుగా మార్చారు. ఇన్చార్జ్లను నియమించారు. సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ ఒక్కమాటతో సరిపెట్టుకున్న రజనీ మళ్లీ యథావిధిగా తన గూటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత అదిగో పార్టీ, ఇదిగో జెండా అంటూ ప్రచారాలు హోరెత్తినా, చివరకు రజనీ రాజకీయ పయనం సాగేనా అన్న అనుమానాలు పెరిగాయి.

2021 అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూ హాలకు పదును పెడుతుంటే, తమ పార్టీ సోదిలో కూడా లేకపోవటం రజనీ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే ‘త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయతీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అద్భుతాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం’ అని రజనీకాంత్‌ ట్వీట్‌ చేశారు. రాజకీయ పార్టీ వివరాలు డిసెంబర్‌ 31న వెల్లడిస్తానని ట్వీట్‌ చేసిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. తరవాత మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. తమిళ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానని అన్నారు.

రాజకీయాల్లో ప్రవేశించే ముందు రాష్ట్రంలో పర్యటించాలనుకున్నా కొవిడ్‌ వల్ల అది సాధ్యపడలేదన్నారు. తమిళ ప్రజల తలరాతలు మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, వచ్చే ఎన్నికల్లో పోటీకి సమాయత్తం కావాలని రజనీ పిలుపునిచ్చారు. ఇపుడు కాకపోతే ఇంకెపుడు అన్నారు. నేను గెలిస్తే అది ప్రజా విజయం, నేను ఓడినా అది ప్రజా ఓటమే అని ఆయన అన్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రజనీ ఫాన్స్ ఇప్పుడు దాదాపు విసిగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. తమ అభిమాన హీరో ఇంటిముందు నిలబడి నినాదాలు చేయటమే కాదు.. తొందరగా పొలిటికల్ ఎంట్రీని ప్రకటించాలని డిమాండ్ లు కూడా మొదలు పెట్టారు. ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నందున, ఆలస్యం చేస్తే నష్టం కలుగుతుందని కొంతమంది కార్యదర్శులు, అభిమాన సంఘాల అధ్యక్షులు నేరుగా రజనీకాంత్ మొహం మీదే చెప్పేశారు. దీంతో రజనీకాంత్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఓపక్క తలైవా వృద్ధుడైపోతున్నాడు. 70ఏళ్ల వయస్సు, అనారోగ్యం ఉండనే ఉంది. నిజానికి రాజకీయాల్లోకి రావాలంటే అటో ఇటో తేల్చుకునే తెగింపు, జనం నాడి పట్టుకునే తెలివి ఉండాలి. ఇవి రజనీకాంత్‌ కి ఏ మేరకున్నాయనేది సందేహమే. ధైర్యంగా ముందుకొచ్చిన రాజకీయాల్లో నిలబడి ఉంటే ఈపాటికి తలైవా అభిమానులు కోరుకునే స్థానంలో ఉండేవాడేమో. అప్పట్లో రజనీ ప్రకటన జయ ఓటమికి కొంతవరకు కారణంగా మారి ఉండొచ్చు. కానీ, రాజకీయ ఎత్తుగడలకు అవసరమైన అనుభవం రజనీకాంత్‌ కు లేదు. ఓ నిర్ణయం తీసుకునే సత్తా లేదు. నటుడిగా టాప్ అయినా, వ్యక్తిగా మంచివాడనే ముద్ర ఉన్నా, ఇవన్నీ రాజకీయాల్లో పనికిరావు. పైగా ఆర్థిక బలమూ అంతంతమాత్రమే. ఇన్ని పరిమితుల మధ్య తలైవా రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తాడనేది ఇంకా ప్రశ్నగానే ఉంది.

 128 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.