ప్రభుత్వ లేఖపై రైతు సంఘాల చర్చలు…
1 min read
AABNEWS : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 28వ రోజుకు చేరుకున్నాయి. అన్నదాతల ఆందోళనలకు పుల్‌స్టాప్ పెట్టడానికి కేంద్రం మరోసారి ముందుకొచ్చింది. చర్చలకు రావాలని ఆహ్వానించింది. అన్నదాతలకు చట్టాలపై అవగాహన కల్పించాలని కేంద్రం ఆలోచిస్తుండగా.. నూతన బిల్లులను రద్దు చేసే దాకా తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు ఖరాఖండిగా చెబుతున్నాయి. మిగతా రైతు సంఘాలను కూడా కేంద్రం చర్చలకు ఆహ్వానించడంపై రైతు సంఘం నేత కుల్వంత్ సంధు స్పందించారు. 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం అన్ని రైతు సంఘాల నేతలు సమావేశమై.. ప్రభుత్వ లేఖపై చర్చిస్తామన్నారు. చర్చలకు వెళ్లాలా..? లేదా అనేది ఈ భేటీలో నిర్ణయిస్తామని వెల్లడించారాయన. కాగా తాము వ్యవసాయ చట్టాల రద్దును తప్ప మరొకటి కోరడం లేదని కుల్వంత్ స్పష్టం చేశారు. అటు ప్రభుత్వం రాసిన లేఖలో కొత్త విషయాలేవి లేవని పెదవి విరిచారు. మరోవైపు బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో రైతుల ఆందోళనపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అని రైతు సంఘాలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు రిపబ్లిక్ డే అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్… భారత్‌కు రావొద్దని కోరుతామని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలో ఉన్న రైతులు అంటున్నారు. ఇందుకోసం బ్రిటన్ ఎంపీలకు లేఖ రాస్తామన్నారు. అన్నదాతలు. ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించిన రైతులు… రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రైతుల ఆందోళనలతో ఢిల్లీ సరిహద్దులు మూతపడ్డాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు హర్యానా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలును అడ్డుకోనున్నాయి రైతు సంఘాలు.
24 Total Views, 2 Views Today