విజేతను నిర్ణయిస్తారా..?
1 min read
AAB NEWS : ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకం. ప్రభుత్వాలను ఎన్నుకోవాలన్నా.. నేలకు దించాలన్నా ప్రజలకున్న ఏకైక ఆయుధం ఈ ఓటు. ప్రజలంతా తమ ఓటును వినియోగించుకుని నాయకులను గెలిపిస్తేనే ప్రజాస్వామ్యం సార్థకమవుతుంది. మరి అలాంటి ఓటు వేయడానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరం. ఉదయం ఓటింగ్ ప్రారంభమైన 2 గంటల వరకు కేవలం 3 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అంతేకాదు ఆ తరువాత కూడా ఓటింగ్ ప్రక్రియ పేలవంగానే కొనసాగింది.
సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం ఓటింగ్ శాతం 30 శాతానికి కొద్దిగా పైనుంది. అంటే దాదాపు 70 శాతం ఓటింగ్ లోటు ఉంది. మరి ఈ ఓటింగ్ శాతంతో విజేతను నిర్ణయించడంపై అనేకమంది పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో ఎన్నికల్లో విజేతను నిర్ణయించే విషయంలో అనేక వాదనలున్నాయి.
సాధారణంగా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారు. దీని ప్రకారం 1000 ఓట్లున్న ప్రాంతంలో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారనుకుందాం. వారిలో 80 శాతం పోలింగ్ నమోదైతే.. ఆ ఓట్లలో 40శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే ఈ విధానాన్ని ఇప్పటికే అనేకమంది వ్యతిరేకిస్తారు. 60శాతం మంది ఓటర్లు వ్యతిరేకించిన అభ్యర్థి గెలిచినట్లు ఎలా అవుతుందంటూ నినదిస్తున్నారు. ఇప్పటికైతే ఈ నినాదం కొందరికే పరిమితమైంది. అయితే ఈ రోజు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు మరో కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చాయనడంలో అతిశయోక్తి లేదు.
అనేక చోట్ల 10 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. అంటే ఆ ప్రాంతంలోని ప్రజల్లో 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఓటు వేశారు. మొత్తం 4 ప్రధాన పార్టీలతో పాటు మరికొందరు ఇండిపెండెంట్లూ బరిలో ఉన్నారు. మరి వీరిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటించడమంటే 90 శాతం మంది కోరుకోని వ్యాక్తే నాయకుడైనట్లు కాదా..? ఇదెలా ప్రజాస్వామ్యమవుతుంది..? అతడిది విజయంగానే పరిగణించాలా..? అనేదే ఇప్పుడు కోట్ల విలువ చేసే ప్రశ్న.
ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే మిగతా ప్రాంతాల్లో నమోదైన అత్యల్ప ఓటింగ్తోనే విజేతను నిర్ణయిస్తారని కదా..? మరి అది ‘ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా ఏర్పాటు చేయబడిన వ్యవస్థ’ ఎలా అవుతుంది..? దీనికి ప్రభుత్వాలు, అధికారుల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.
40 Total Views, 2 Views Today