AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

హోం మంత్రి అమిత్ షాతో రైతు సంఘాలు రాత్రి 7 గంటలకు భేటీ…

1 min read

AAB NEWS : మెదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపుతో మంగళవారం భారత్ బంద్ జరిగింది.

ప్రధానంగా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులు చేపట్టిన ఆందోళనలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్టీల నుంచి మద్దతు లభించింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా దేశవ్యాప్తంగా 24 పార్టీలు రైతుల భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. అందులో కాంగ్రెస్, వామపక్షలు, టీడీపీ ఉన్నాయి.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ బంద్ జరుగుతుందని రైతు సంఘాల యూనియన్ ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం నుంచే బంద్ మొదలయింది.

కాగా, హోం మంత్రి అమిత్ షాతో ఈరోజు సాయంత్రం 7 గంటలకు తాము భేటీ కానున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికైత్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

ఆంధ్రా, తెలంగాణల్లో ముగిసిన బంద్:

దేశవ్యాప్తంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన బంద్ ఆంధ్ర, తెలంగాణల్లో జరిగింది. ఆంధ్రాలో ప్రభుత్వం అధికారికంగా బంద్ నిర్వహించగా, తెలంగాణలో అధికారిక టిఆర్ఎస్ బంద్ లో విస్తృతంగా పాల్గొంది.

టిఆర్ఎస్ బంద్ కు మద్దతు ప్రకటించి, తన మంత్రులు, ఎమ్మెల్యేలను వివిధ ప్రాంతాల్లో మొహరించింది. ఆ పార్టీ మంత్రులూ, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. హైవేలపై కూర్చుని ట్రాఫిక్ ఆపారు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, బైకులతో ప్రదర్శన నిర్వహించారు.

కామారెడ్డి శివార్లలోని ఎల్లారెడ్డి దగ్గరలోని టెక్రియాల్ దగ్గర హైవేపై కవిత బంద్ పాటించారు. కాజీపేట దగ్గర్లో మంత్రి యర్రబెల్లి దయాకర రావు, సూర్యాపేటలో ట్రాక్టర్లతో జగదీశ్ రెడ్డి, మహబూబాబాద్ లో మంత్రి సత్యవతి రాథోర్, నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్, నిజామాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్, ఆలంపూర్ లో మంత్రి నిరంజన్ రెడ్డి, తూప్రాన్ దగ్గర మంత్రి హరీశ్ రావు, షాద్ నగర్ దగ్గర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు, ఎంపీ కేశవ రావులు ఆందోళనల్లో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నిలదీసిన ప్రజలు: హైదరాబాద్లో బంద్ విషయంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నిరసన తలపెట్టిన ప్రదేశంలో సామాన్యులు బంద్ ను ప్రశ్నించారు. గంటన్నరగా తమను ట్రాఫిక్ లో ఇబ్బంది పెట్టారని ఒక మహిళ నిలదీసింది. మరో వ్యక్తి నేరుగా ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. దీంతో ఆ వ్యక్తిని తోసేశారు ఎమ్మెల్యే. స్వయంగా ఎమ్మెల్యేనే చేయెత్తి తోసేయడంతో, ఆయన అనుచరులు ఇంకా రెచ్చిపోయి ఆ వ్యక్తిని ఫుట్ పాత్ నుంచి బస్ స్టాప్ వరకూ తోసేశారు.

ఇక యాదగిరిగుట్టలో బంద్ పాటించిన ఒక దుకాణదారుపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. షాపులో వస్తువులను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు అక్కడే ఉండి కూడా భద్రత కల్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ వ్యక్తి.

మహబూబాబాద్ లో ఆందోళన నిర్వహించిన మంత్రి సత్యవతి రాథోర్, ఎమ్మెల్యే శంకర నాయక్ లను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ లో బంద్ సందర్భంగా టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్న కొట్లాట జరిగింది.

ఇక కోఠి మహిళా కాలేజీ దగ్గర వామపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్ పార్టీ పలుచోట్ల ఆందోళనల్లో పాల్గొంది. టిఆర్ఎస్ కార్యకర్తలు ట్యాంక్ బండ్ పై ర్యాలీ నిర్వహించగా, ఫర్ ఐటి సంస్థ ప్రతినిధులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన నిర్వహించారు.

ఇక ఆంధ్రలో కూడా బంద్ సాగింది. ఇక్కడ ప్రభుత్వమే నేరుగా బంద్ కు సంఘీభావం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, మధ్య నుంచే తెరిచారు. ఆర్టీసీ బస్సులు కూడా మధ్యాహ్నం నుంచే నడిపారు. ప్రభుత్వమే బంద్ కి మద్దతివ్వడంతో పలుచోట్ల దుకాణాలు తెరవలేదు.

తెల్లవారుజాము నుంచే కాంగ్రెస్, వామపక్షాలు విజయవాడ బస్టాండ్ దగ్గర ఆందోళన చేపట్టాయి. ముద్రగడ పద్మనాభం రైతు సమస్యలపై మోదీకి లేఖ రాశారు. తెలుగుదేశం కార్యకర్తలు జిల్లా కలెక్టర్లకు రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

రెండు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ లు బంద్ కు వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడారు. ఈ బంద్ చేయడాన్ని తప్పు పట్టారు. ఇవి రైతులకు మేలు చేసే చట్టాలని చెప్పుకొచ్చారు.

రైతులు శాంతిపూర్వక ప్రదర్శనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలు కొనసాగేలా చూడాలని కూడా కోరారు. బ్యాంక్ యూనియన్లు భారత్ బంద్‌కు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుతామన చెప్పాయి. వాణిజ్య రవాణా, ట్రక్ యూనియన్లు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తెల్లవారుజామునే భారత్ బంద్ ప్రభావం మొదలైంది. ముందు జాగ్రత్తగా బస్సులు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసివేస్తున్నట్లు తెలిపింది. విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించింది.

విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతల్లో బస్టాండ్ల దగ్గరకు చేరుకున్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతు సంఘాల నేతలు నిరసనలు ప్రదర్శనలకు దిగారు. రహదారులపై వాహనాలను అడ్డుకున్నారు. చాలా ప్రాంతాల్లో వ్యాపారాలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు.

 236 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.