9 రాష్ట్రాలకు బర్డ్‌ఫ్లూ…
1 min read
AABNEWS : దేశంలోని 9 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ ప్రబలినట్టుగా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ధ్రువీకరించింది. ఈ మేరకు కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, గుజరాత్‌లను అప్రమత్తం చేసింది. కోళ్లు, పక్షులపై నిఘా పెట్టి.. అసాధారణ మార్పులు గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలంటూ కోరినట్టు అధికారులు తెలిపారు. పరిస్థితులను అంచనా వేసి, తగు చర్యలు తీసుకునేందుకు కేరళ, హరియాణా, హిమాచల్‌లకు కేంద్ర బృందాలను పంపినట్టు వెల్లడించారు. వ్యాధి ప్రబలిన రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్ ఫ్లూ) కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా పశుసంవర్ధకశాక అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. దిల్లీలోని ఓ ప్రాంతంలో గత కొన్నిరోజుల్లో దాదాపు ఇరవై కాకులు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. పశుసంవర్ధకశాఖ అధికారులు శుక్రవారం కొన్ని కాకుల మృత కళేబరాల నుంచి నమూనాలు సేకరించి జలంధర్ ప్రయోగశాలకు పంపారు. ఇండోర్, రాయపుర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, నీమచ్ నగరాల్లో సేకరించిన కోళ్ల నమూనాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ (హెచ్5ఎన్8) ఉన్నట్టుగా నిర్ధరణ అయింది. ఆయా ప్రాంతాల్లో దుకాణాలు, చికెన్ సెంటర్లు వారం రోజులపాటు మూత వేయాల్సిందిగా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యాధి మరింత విస్తరించకుండా భోపాల్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామంలో శుక్రవారం మృతిచెందిన నాలుగు కాకుల్లో మూడింటి నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్‌లోని జాతీయ ప్రయోగశాలకు పంపినట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారుతో సమావేశమై బర్డ్‌ఫ్లూ తీవ్రతపై చర్చించారు. రాష్ట్రంలోని అలహాబాద్‌కు వచ్చే వలస పక్షులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. హిమాచల్ సీఎం జైరామ్ ఠాకుర్ బర్డ్‌ఫ్లూ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 3,400కు పైగా కోళ్లు చనిపోయిన పోగ్ డ్యాం పరిసర ప్రాంతాలు అధికారుల పర్యవేక్షణలో ఉన్నాయన్నారు. హరియాణాలోని పంచ్‌కుల జిల్లాలో అయిదు పౌల్ట్రీలకు చెందిన కోళ్ల నమూనాలు పరిశీలించగా.. కొన్నింటికి బర్డ్‌ఫ్లూ పాజిటివ్ రావడంతో 1.66 లక్షల కోళ్లను సంహరిస్తున్నట్టు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి జేపీ దలాల్ శుక్రవారం తెలిపారు. ఈ నమూనాలను భోపాల్ ప్రయోగశాలకు పంపి, నిర్ధరణ చేయించినట్టు మీడియాకు చెప్పారు. కోళ్లను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూడ్చిపెడతామన్నారు. కోళ్ల యజమానులకు కోడికి రూ.90 చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. రాజస్థాన్‌లో ఇప్పటిదాకా 2,166 పక్షులు మృతిచెందాయి. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల దిగుమతిని తక్షణం నిలిపివేసింది. బర్డ్‌ఫ్లూ ఆందోళనలతో దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం కోడిమాంసం అమ్మకాలు 20-25 శాతం తగ్గాయి. భారత పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు రమేశ్ ఖత్రి మాట్లాడుతూ.. బ్రాయిలర్ చికెన్‌కు ఎటువంటి బర్డ్‌ఫ్లూ ముప్పు లేకున్నా.. ప్రజల్లో ఉన్న భయాల కారణంగా ధరలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
287 Total Views, 2 Views Today