కాల్పుల కలకలం ఇద్దరికి బుల్లెట్ గాయాలు భయంభయం
1 min read
AABNEWS : AMJAD KHAN Adilabad Staffer ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీ.. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం సాయంత్రం ఐదు గంటలకు తల్వార్ దాడులు.. బుల్లెట్ శబ్దాలతో దద్దరిల్లింది. పాతకక్షలతో ఈ ఘటన జరిగినట్టు తెలవగా, ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లలు క్రికెట్ ఆడుతుండగా జరిగిన చిన్న ఘటనలో తల్లిదండ్రులు కలుగజేసుకోవడంతో పెద్దదిగా మారింది. రెండు గ్రూపుల మధ్య దశాబ్దంన్నర క్రితం నుంచి పాతకక్షలు ఉండడంతో దాడుల వరకు వెళ్లింది. ఒక గ్రూపునకు చెందిన వారు తల్వార్ లు, ఇతర వాటితో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్ పై దాడి చేయడంతో ఆయన తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ రివాల్వర్ (0.32 ఎఫ్ జీ, 29524 పిస్టల్) తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సయ్యద్ జమీర్ కు రెండు బుల్లెట్ గాయాలు కాగా, సయ్యద్ మోతెసిన్ కు ఒక బుల్లెట్ తాకింది. ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డ సయ్యద్ జమీర్, సయ్యద్ మోతెసిన్ ను వెంటనే రిమ్స్ కు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ కు తరలించారు. తాటిగూడ ప్రాంతంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిందితుడి గన్ లైసెన్స్ ను రద్దు చేయాలని కలెక్టర్ కు సిఫారసు చేశారు.


20 Total Views, 2 Views Today