September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కేసీఆర్ అందరి జీతాలు పెంపు…

1 min read

AABNEWS : నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరి లోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది.

 271 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.