AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

డీపీసీల ఏర్పాటుకు చర్యలు…

1 min read

AABNEWS : డీపీసీల ఏర్పాటుకు చర్యలు
జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోనూ కమిటీలు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు పదోన్నతుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టరేట్లలోనూ దీనిపై కసరత్తు జరగనుంది. నెలాఖరులోగా యుద్ధప్రాతిపదికన పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసి, తద్వారా ఏర్పడే ఖాళీల జాబితాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారు. దీనికి అనుగుణంగా శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణను ప్రకటించారు.దానికి అనుగుణంగా కసరత్తు జరగనుంది. రాష్ట్రంలో 34 ప్రధాన శాఖలుండగా.. వాటికి అనుబంధంగా మరో 40 శాఖలున్నాయి. 104 శాఖాధిపతుల కార్యాలయాలున్నాయి. 33 జిల్లాలున్నాయి. వీటన్నింటా కలిపి వేల మందికి పదోన్నతులు రానున్నాయి. సచివాలయంలో వందమంది వరకు దక్కుతాయి. పదోన్నతుల ప్రక్రియకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) ఏర్పాటవుతుంది. ఈ కమిటీలో సంయుక్త కలెక్టర్‌, సంబంధిత శాఖ జిల్లా అధికారి ఉంటారు. జిల్లా పరిధిలోని నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తారు. శాఖాధిపతుల కార్యాలయాల పరిధిలో మొదటి, రెండో గ్రేడ్‌ గెజిటెడ్‌ అధికారుల పదోన్నతుల కోసం ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన డీపీసీ ఏర్పాటవుతుంది. దీనిలో ఆ శాఖ అదనపు కార్యదర్శి, శాఖాధిపతి ఉంటారు. సచివాలయంలో మూడు నుంచి అయిదో గ్రేడ్‌ గెజిటెడ్‌ అధికారుల పదోన్నతుల ప్రక్రియ సాధారణ పరిపాలన శాఖ పరిధిలో ఉంటుంది. ప్రధాన కార్యదర్శి లేదా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పడే డీపీసీలో సీనియర్‌ ఐఏఎస్‌లు, సంబంధితశాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ముందుగా పైస్థాయి నుంచి ఖాళీలను పరిగణనలోకి తీసుకొంటారు. వాటికి అనుగుణంగా కిందిస్థాయి వారికి పదోన్నతులు ఇస్తారు. ఉదాహరణకు సచివాలయాన్ని తీసుకుంటే అదనపు కార్యదర్శుల ఖాళీలను సంయుక్త కార్యదర్శులకు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేస్తారు. ఆపై సంయుక్త కార్యదర్శుల పోస్టుల్ని ఉప కార్యదర్శులతోనూ, ఉపకార్యదర్శుల ఖాళీలను సహాయ కార్యదర్శులతోనూ నింపుతారు. సహాయ కార్యదర్శుల పోస్టులను విభాగాధికారుల ద్వారా, విభాగాధికారుల పోస్టులను సహాయ విభాగాధికారులతో పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. పదోన్నతులకు సీనియారిటీ ప్రధానం. అందులోనూ ఆ ఉద్యోగి పనితీరు, నడవడికను పరిశీలించాక అర్హులుగా పరిగణిస్తారు. ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఇచ్చే వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్‌)లు కీలకంగా మారుతాయి. సస్పెండయినా, క్రమశిక్షణ చర్యలకు గురైనా, ఫిర్యాదులున్నా పదోన్నతులకు ఇబ్బందులుంటాయి సర్వీసు నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగానికైనా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్ల కాలం పూర్తి చేసుకుంటేనే వారు పదోన్నతులకు అర్హులవుతారు. ఈ మూడేళ్లను రెండేళ్లకు తగ్గించాలని ఉద్యోగ సంఘాల వారు 2018 మేలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరగా ఆయన అంగీకరించి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా జూన్‌ 5న సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు. ఆ ఉత్తర్వు గడువు 2019 జూన్‌ 5తో ముగిసింది. అప్పటి నుంచి రెండేళ్ల సర్వీసునే కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తాజాగా పదోన్నతులు చేపట్టడంతో మళ్లీ ఈ అంశం తెరపైకొచ్చింది. మరోసారి సీఎంను కలిసి ఉద్యోగ సంఘాలు ఈ విషయం విన్నవించనున్నాయి.

 109 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.