మాంసం కోసం హమాలీ హత్య…
1 min read
AABNEWS : నిజామాబాద్ : తాను పెంచుకున్న కుక్కకు మాంసం పెట్టలేదని ఒకరితో గొడవకు దిగి మరొకరిని హత్య చేసిన సంఘటన జిల్లా నవీపేట్ మండలం మోకన్‌పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్ రాష్ట్రంలోని యన్సికి తాలూకాలోని అమ్ని గ్రామానికి చెందిన 11 మంది హమాలీలు బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం ఇక్కడికి వచ్చారు. మోకన్పల్లిలోని ఓ రైస్‌మిల్లులో పనికి కుదిరారు. ఇందులో నరేశ్ చౌదరి ఆదివారం పంది మాంసం తీసుకొచ్చాడు. మనోహార్ వంట చేశాడు. అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. అభిమాన్య అనే తోటి హమాలీ తాను పెంచుకుంటున్న కుక్కకు సైతం మాంసం పెట్టాలని కోరాడు. అంతలోనే మిథున్ అనే హమాలీ కుక్కకు మాంసం పెట్టడాన్ని వ్యతిరేకించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఉన్న అభిమాన్య బండరాయితో మిథున్‌పై దాడికి దిగాడు. దీంతో మిథున్ భయపడి పారిపోయాడు. కుక్కకు మాంసం పెట్టలేదన్న కోపంతో ఊగిపోతున్న అభిమాన్య అదే సమయంలో అక్కడే రైస్‌మిల్‌లో నిద్రలో ఉన్న తేజు సదాను నిద్ర లేపి ఆయనతోనూ వాగ్వాదానికి దిగాడు. వీరిద్దరి మధ్య మాటామాట పెరగడంతో అభిమాన్య తేజుసదా తలపై బండరాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తేజుసదా మిథున్‌కు దగ్గరి బంధువు. అభిమాన్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతుడి సోదరుడు బిజిలి సదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్ర వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై యాకూబ్ తెలిపారు.
50 Total Views, 2 Views Today