September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నిర్లక్ష్యం ఖరీదు… అయిదు ప్రాణాలు

1 min read

AAB NEWS:Dr. శశిధర్ రెడ్డి వరంగల్ బ్యూరో

రెడ్‌సిగ్నల్‌ ఉన్నది.. ఆగమని చెప్పడానికే. అర్ధరాత్రి కదా, మనల్నెవరు పట్టించుకుంటారని భావించారు. నిర్లక్ష్యంగా కారును ముందుకు దూకించారు. అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న ఓ టిప్పర్‌.. ఈ కారును ఢీకొట్టి తిరగబడింది. అంతే.. కారులో ఉన్న అయిదుగురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఆదివారం తెల్లవారు జామున సంభవించిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైనవారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. టిప్పర్‌ డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది. మరణించిన యువకుల్లో నలుగురు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఓ వసతిగృహంలో ఉంటున్నారు. వారిలో ఒకరు తన మిత్రుడు కావడంతో కలిసేందుకు వచ్చిన మరో యువకుడు నాలుగు రోజుల నుంచీ వారితోనే ఉంటున్నాడు. మంచి మిత్రులైన వారు మరణంలోనూ బంధం వీడలేదు. హైదరాబాద్‌ గచ్చిబౌలి విప్రో కూడలి వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వారంతా దుర్మరణం చెందడం అందర్నీ కలచివేసింది.

వారాంతం కావడంతో…
పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయిగూడెం గ్రామానికి చెందిన కాట్రగడ్డ సంతోష్‌(25), నెల్లూరుకు చెందిన రోషన్‌(23), తూర్పుగోదావరి జిల్లా ఉయ్యూరివారిమెరక గణేష్‌కాలనీకి చెందిన చింతా మనోహర్‌(23), విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ సుందరయ్య వీధికి చెందిన పప్పు భరద్వాజ్‌(20), నెల్లూరు జిల్లా ఆంధ్రకేసరినగర్‌ వేదాయపాలెం త్యాగరాజనగర్‌కు చెందిన కొల్లూరు పవన్‌కుమార్‌(24) మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఒక హాస్టల్‌లో ఉంటున్నారు. సంతోష్‌, రోషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. మనోహర్‌, భరద్వాజ్‌ యానిమేషన్‌ కంపెనీలో ఉద్యోగులు. బీటెక్‌ పూర్తి చేసిన పవన్‌ కుమార్‌ విదేశాలకు వెళ్లేందుకు అర్హత పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నాడు. నాలుగు రోజుల కిందట స్నేహితుడు రోషన్‌ను కలిసేందుకు వచ్చి హాస్టల్‌లోనే ఉండిపోయాడు. వారాంతం కావడంతో సరదాగా అయిదుగురూ షికారుకెళ్లాలనుకున్నారు. శనివారం రాత్రి 9.26 గంటలకు సంతోష్‌ కారులో బయలుదేరారు.

మెరుపు వేగంతో కుడివైపు మళ్లారు…
నగరంలో శనివారం రాత్రి ఐదు గంటలపాటు సరదాగా తిరిగారు. అర్ధరాత్రి దాటాక 2.46 గంటలకు గచ్చిబౌలి విప్రో చౌరస్తాకు చేరుకున్నారు. రెడ్‌ సిగ్నల్‌ పడి ఉన్నా ఆగకుండా మెరుపు వేగంతో కుడివైపునకు మళ్లారు. కోకాపేట్‌ వైపు నుంచి గచ్చిబౌలి వెళుతున్న టిప్పర్‌ డ్రైవర్‌ కూడలిలో గ్రీన్‌ సిగ్నల్‌ చూసి వేగం పెంచాడు. కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో టిప్పర్‌ కారుపైకి ఎక్కి బోల్తాపడింది. కారు నుజ్జునుజ్జయింది. సంతోష్‌, పవన్‌కుమార్‌, మనోహర్‌, రోషన్‌ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. కొన ఊపిరితో ఉన్న భరద్వాజ్‌ను పోలీసులు ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 6 గంటలకు మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌ రేవా ప్రాంతానికి చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ దీపేంద్రసింగ్‌ స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోవడంతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఉపాధి నిమిత్తం గచ్చిబౌలికి వచ్చిన ఇతను కొండాపూర్‌లో సెల్లార్‌ తవ్వకంలో బయటపడిన బండరాళ్లను కోకాపేట్‌లోని క్రషర్‌కు తరలిస్తున్నాడు. మనోహర్‌కు రెండేళ్ల కిందటే వివాహమయింది. భార్య, కుమార్తె ఉన్నారు. పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. రెడ్‌ సిగ్నల్‌ పడిఉన్నా కారు ఆగకుండా వెళ్లినట్లు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చారు. మద్యం తాగి ఉన్నారా.. లేదా.. అన్నది శవపరీక్షలో తేలుతుందని వివరించారు.

 154 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.