AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ముప్పయ్యేళ్లకు కలిసిన తల్లీకొడుకులు…

1 min read

AABNEWS : ఓ పదేళ్ల పసివాడు ఇంట్లో వాళ్లపై అలిగాడు. రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఇంట్లోవాళ్లపై కోపంతో కదిలే రైలెక్కాడు. తాను అడిగింది కాదన్నందుకు అలిగి ఏడ్చి ఏడ్చి అలసిపోయాడేమో.. రెలెక్కగానే నిద్రపోయాడు. నిద్ర లేచి కళ్లు నులుముకుని చూసేసరికి తనకు తెలీని ప్రాంతంలో ఉన్నాడు. చిన్నగా కదులుతున్న రైలు నుంచి దిగాడు. ఎటు పోవాలో అర్థంకాని స్థితిలో బిక్కు బిక్కుమంటూ తిరుగుతున్న ఆ పిల్లవాణ్ని చూసి జాలిపడిన ఓ వ్యక్తి అతన్ని చేరదీశాడు. ఆకలి తీర్చాడు. అక్కున చేర్చుకున్నాడు. పెంచి పెద్ద చేశాడు. పెరిగి పెద్దయిన ఆ పిల్లోడికి తర్వాత పెళ్లి కూడా చేశాడు. అలా అలా ముప్పై ఏళ్లు గడచిపోయాయి. అయినా ఆ పిల్లాడి మనసులో ఎక్కడో తల్లిని కలుసుకోవాలన్న బలమైన కోరిక. కానీ ఎలా.. తనకేం గుర్తులేవు. ఊరు పేరు.. చిరునామా తెలీదు. అయినా ఎక్కడో చిరు ఆశ. తల్లిని కలుసుకోవాలని. ముప్పై ఏళ్లకు అతని ఆశ నెరవేరింది. ఎలాగోలా వివరాలు తెలుసుకుని తల్లిని చేరుకున్నాడు. ఇన్నాళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చిన కొడుకును చూసి ఆ తల్లి మనసు మురిసింది. ఆనంద భాష్పాలతో తడిసి ముద్దయింది. అలా మూడు దశాబ్దాల తర్వాత తల్లీకొడుకులు ఒక్కటయ్యారు.ఇదేదో సినిమా స్టోరీలా ఉన్నా.. నిజంగా నిజం. పిల్లాడిగా ఉన్నపుడు అమ్మానాన్నలపై అలిగి బయలుదేరిన ఊరు పేరు తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా అబ్బూరు తాలూకా కథవాలెం గ్రామం.. ఆశ్రయం పొందింది తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లి రైల్వేస్టేషన్‌.. అక్కడికి సమీపంలోని చిమ్మపూడి గ్రామానికి చెందిన దొంతు సత్యం, నాగమణి దంపతులు రమేష్‌ను చేరదీశారు. ముప్పై ఏళ్లు వీరితోనే ఉన్న రమేష్‌కు దగ్గరిలోని మల్లేపల్లికి చెందిన లక్ష్మితో పెళ్లయింది. రమేష్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో సూపరవైజర్‌గా పనిచేస్తుంటాడు. కంప్యూటర్‌ యుగంలోనూ తల్లిదండ్రులను కలుసుకోడానికి ఇన్నాళ్లు పట్టిందా…? గూగులమ్మను అడిగితే పోయేది కదా అన్న డౌట్‌ రావొచ్చు.. చిన్నతనంలో ఇంటి నుంచి వచ్చిన రమేష్‌కు తల్లిదండ్రుల వివరాలు తప్ప ఊరు పేరు కానీ.. మిగిలిన అడ్రస్‌ తెలీదు. దీంతో అతను మనుషులనే నమ్ముకున్నాడు.గ్రానైట్‌ ఇండస్ట్రీలో పనిచేయడానికి టెక్నీషియన్లు.. కార్మికులు తమిళనాడు నుంచి రావడం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నదే. అలా వచ్చిన వారిని రమేష్‌ పరిచయం చేసుకుని వాకబు చేశాడు. రైలు ప్రయాణాలపై విరివిగా ఆరా తీశాడు. ఎక్కడ ఎక్కితే ఎక్కడకు ఎంత టైం.. ఎన్ని స్టేషన్లు అంటూ ఆరా తీసేవాడు. ఖాళీ దొరికినపుడల్లా వాళ్లతో కూర్చుని వివరాలు తెలుసుకునేవాడు. తాను పనిచేసే గ్రానైట్‌ పరిశ్రమ యజమాని కొడుకు సహాయంతో అక్కడి ట్రేడర్స్‌ ద్వారా ఊర్ల పేర్లు.. ఆ ఊరిలో ముప్పై ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకున్న కుటుంబాల వివరాలు ఆరా తీశాడు. ఎన్నో ప్రయత్నాల మీదట అతని శోధన ఫలించింది. ఎట్టకేలకు అడ్రస్‌ కనుక్కున్నాడు. ఇక నేరుగా రైలెక్కాడు. సరిగ్గా కథవాలెం చేరుకున్నాడు.

 63 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.