వర్షాలకు దెబ్బతిన్న అల్లం…
1 min read
AAB NEWS :జహీరాబాద్ ‘‘అన్నా..ఎన్నో ఆశలు పెట్టుకుని అల్లం పంటేసినా.. దుక్కి దున్నడం, విత్తనం ఖరీదు, ఎరువులు, పురుగు మందులు, కలుపు తీయడం, ఇతరత్రా అన్నీ కలిపి ఇప్పటి దాకా ఎకరానికి రూ.2లక్షల పైనే ఖర్చు చేసినా. గతనెలలో కురిసిన భారీ వర్షాలకు సగానికిపైగా పంట దెబ్బతింది. కనీసం ఉన్న పంటనైనా అమ్ముకుందామంటే విపణిలో పలుకుతున్న ధరతో గిట్టుబాటు అయ్యేలా లేదని పొలంలోనే వదిలేసినా. పెట్టుబడి, కుటుంబ పోషణ కోసం తీసుకువచ్చిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు.”
కేరళ రాష్ట్రం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జహీరాబాద్ ప్రాంతంలో మాత్రమే అల్లం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుం టారు. జహీరాబాద్, కోహీర్ మండలాల్లోని ఏ రైతు పొలానికి వెళ్లినా ఈ పంట తప్పకుండా కన్పిస్తుంది. ఇంకా ఝరాసంగం, మొగుడంపల్లి, న్యాల్కల్ మండలాల్లోని అనేక మంది రైతులు సాగు చేస్తారు. ఈ సంవత్సరం జహీరాబాద్‌తో పాటు జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కలిపి దాదాపు 8 వేల పైచిలుకు ఎకరాల్లో అల్లం పంటను వేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఆహార పదార్థాల్లో దీనిని ఎక్కువగా వాడుతుంటారు. కరోనా, లాక్డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు దాభాలు, ఇతర ఆహార ఉత్పత్తి పరిశ్రమలు మూసివేయడంతో వినియోగం తగ్గిపోయి ధరపై తీవ్ర ప్రభావం పడిందని తెలుస్తోంది. ఇటీవల లాక్డౌన్ నిబంధనలు సడలించినా బయటి ఆహారం తినేవారి సంఖ్య అంతగా లేకపోవడంతో గిరాకీ పెరగడం లేదు.చాలా కాలంగా డిమాండ్ లేకపోవడంతో పంటను పొలాల్లోనే ఉంచేశారు. ధర పెరిగినప్పుడు అమ్ముకోవచ్చని రైతులు భావించినప్పటికి ఈ ఏడాది అక్టోబరు, నవంబరులో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. మిగిలిన పంటనైనా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లభించక రైతుల ఆశలు తలకిందులయ్యాయి. ఎకరానికి సగటున 100 నుంచి 120 క్వింటాళ్ల దిగుబడులు వచ్చి, క్వింటాలుకు రూ.4 నుంచి 5 వేల ధర పలికితేనే తమకు లాభదాయకంగా ఉంటుందని పలువురు రైతులు తెలిపారు. ఈ ఏడాది వేసవిలో నీటి కొరత వల్ల పంట దెబ్బతినగా, వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల అదే పరిస్థితి తలెత్తింది. అత్యధిక శాతం రైతులకు ఎకరానికి 50 నుంచి 60 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. దీనికి తోడు క్వింటాలుకు రూ.2000 లోపే ధర పలుకుతుండటంతో పెట్టుబడులూ దక్కని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేను ఎకరన్నర పొలంలో అల్లం సాగు చేశా. ఎకరానికి రూ.2లక్షల చొప్పున ఇప్పటి వరకు రూ.3 లక్షల పైనే ఖర్చయింది. గత నెలలో కురిసిన వర్షానికి పంట పూర్తిగా దెబ్బతింది. ఉన్న పంటను అమ్ముకుందామంటే తీయడానికి కూలీల ఖర్చు, మార్కెట్‌కు తరలిచేందుకు రవాణా ఖర్చులు అదనంగా పెట్టలేక పొలంలోనే వదిలేశా. పెట్టుబడికోసం చేసిన అప్పులు, వాటిపై పెరిగిన వడ్డీ ఎలా తీర్చాలో పాలుపోవడం లేదు.
40 Total Views, 4 Views Today