AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఏ షట్టర్ అయిన 5 నిమిషాల్లో ఫట్‌…

1 min read

AAB NEWS : హైదరాబాద్‌ : ఇన్నోవా కారును అద్దెకు తీసుకుంటారు.. ముంబై నుంచి కారులో బయల్దేరుతారు. ముందే నిర్ణయించుకున్న వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు చేరుకుంటారు. అక్కడ నంబర్‌ ప్లేట్‌ మార్చేస్తారు. రాత్రి సమయంలో ఖరీదైన దుకాణాలు, షోరూమ్స్‌ను టార్గెట్‌ చేస్తారు. ముగ్గురు కారులోనే కూర్చుంటారు. ఇద్దరు మాత్రమే బయటకు వస్తారు. ఒక్క చిన్నపాటి గడ్డపారతో రంగంలోకి దిగుతారు. చాకచక్యంగా కేవలం 5 నిమిషాల్లోపే షట్టర్‌ లిఫ్ట్‌ చేస్తారు. ఆ తర్వాత గడ్డపారను కారులో పడేస్తారు. పెద్ద సంచులతో షట్టర్‌ కింద నుంచి దుకాణంలోకి దూరిపోతారు. ఖరీదైన వస్తువులను నిమిషాల్లో సర్దేసి షట్టర్‌ను కాలుతో కిందకు తొక్కేసి చోరీ సరుకును కారులో వేసుకొని ఉడాయిస్తారు.

కారు నంబర్‌ ప్లేట్‌ మార్చేసి.. దారి మధ్యలో మరికొన్ని దుకాణాల్లో దోపిడీలు చేసి ముంబైకి బయల్దేరుతారు. ఇలా కొన్నేళ్లుగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వందలాది సెల్‌ఫోన్‌లు, దొరికినంత నగదు దోచుకున్నారు. పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారారు. చోరీ చేసిన సెల్‌ఫోన్‌లను ఓల్‌ఎక్స్‌లో పెట్టి అమ్మేస్తారు. గతనెల-13న మియాపూర్‌ పరిధిలోని రిలయన్స్‌ షోరూంలో దోపిడీకి పాల్పడిన ఈ ముఠా.. రూ. 30 లక్షల విలువైన సెల్‌ఫోన్ల దోపిడీ చేసింది. సీపీ సజ్జనార్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన మియాపూర్‌, మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు ముంబై పోలీసుల సహకారంతో షట్టర్‌ లిఫ్టింగ్‌ ముఠా ఆటకట్టించారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 30లక్షల విలువైన సెల్‌ఫోన్‌లు, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు. సీపీ సజ్జనార్‌ మంగళవారం కమిషనరేట్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

రిలయన్స్‌ షోరూంలో చోరీ ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలను బట్టి ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనే అని పోలీసులు అనుమానించారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. అదేరోజు రాత్రి పంజాగుట్టలో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న దుకాణంలో చోరీ చేసి, రూ. 7000 నగదు, మరుసటి రోజు ఉదయం 6:30గంటలకు ముంబై వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో పటాన్‌చెరువు వద్ద రోడ్డుపక్కన ఒక వైన్‌షాపు షట్టర్‌ లిఫ్ట్‌ చేసి మూడు మద్యం బాటిళ్లు, రూ. 700 నగదు దోపిడీ చేసి, ఇన్నోవా కారులో ఉడాయించినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆయా పోలీస్‌ స్టేషన్‌లలో కూడా కేసులు నమోదయ్యాయి. ఇదంతా ముంబైకి చెందిన ఫ్రొఫెషనల్‌ ముఠా పనిగా సీపీ నిర్ధారించారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సందీప్‌, మియాపూర్‌ ఏసీపీ పర్యవేక్షణలో ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌, మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ తన సిబ్బందితో రంగంలోకి దిగారు.

ముంబైకి వెళ్లిన పోలీసులు నిందితుల ముఠా గురించి, వారి నేరచరిత్ర గురించి ఆరా తీశారు. వారంతా మూడు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నారని తెలుసుకున్నారు. సీపీ సజ్జనార్‌ చొరవతో ముంబై క్రైం బ్రాంచి జాయింట్‌ సీపీ మిలింద్‌ బరంబే సైబరాబాద్‌ పోలీసులకు పూర్తి సహకారం అందించారు. ఆయన ఆదేశాలతో ముంబై పోలీసులు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి సైబరాబాద్‌ పోలీసులతో కలిసి జాయింట్‌ ఆపరేషన్‌ చేశారు. ఎట్టకేలకు ముంబైలోనే షట్టర్‌ లిఫ్టింగ్‌ గ్యాంగ్‌ ఆటకట్టించారు. ముఠా నాయకుడు మహ్మద్‌ తర్బేజ్‌ దావుద్‌ షేక్‌, ఫర్హాన్‌ ముంతాజ్‌షేక్‌, రషీద్‌ మహ్మద్‌ రఫీక్‌ షేక్‌, మహ్మద్‌ సుఫియాన్‌ షేక్‌ అలియాస్‌ సుబ్రతో దాస్‌ అలియాస్‌ మంగు, రాజు పాండురంగ అంబేడ్కర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఒక ఇంట్లో దాచిపెట్టిన 113 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీస్‌ సిబ్బందిని సీపీ సజ్జనార్‌ అభినందించి రివార్డులు అందజేశారు.

 46 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.