AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గద్దెదిగుతారా.. చట్టాలు రద్దు చేస్తారా…

1 min read

AAB NEWS : హైదరాబాద్ : రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారా? గద్దె దిగుతారా?అని ప్రధాని మోడీని వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. కార్పొరేట్‌ సంస్థలు, విదేశీ బహుళజాతి సంస్థలకు వ్యవసాయరంగాన్ని అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. అంబానీ, అదానీల కోసమే మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చిందని చెప్పారు. ఈ చట్టాలను రద్దు చేసే వరకూ పోరాటం ఆగదనీ, మరింత ఉధృతమవుతుందని అన్నారు. భారత్‌బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతివ్వడాన్ని స్వాగతించారు. అయితే ఆ మూడు చట్టాలను రాష్ట్రంలో అమలు చేయబోమని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని కోఠి నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వరకు వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ఫ్లకార్డులు ప్రదర్శించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వద్ద సభ జరిగింది.
130 కోట్ల మంది కోసమే ఈ బంద్‌ : బీజేపీ మినహా మిగతా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారత్‌ బంద్‌ నూటికి నూరు శాతం విజయవంతంగా జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇది రైతాంగం కోసమే కాకుండా 130 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్యలపై బంద్‌ జరుగుతున్నదని వివరించారు. వ్యవసాయరంగానికి చేటు తెచ్చే మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ సంస్థలు, విదేశీ బహుళజాతి సంస్థలు, సామ్రాజ్యవాద శక్తులకు వ్యవసాయరంగాన్ని అప్పగించేందుకు ఈ చట్టాలను తెచ్చిందని విమర్శించారు. ఎంతైనా నిల్వ చేసుకునీ, బ్లాక్‌మార్కెట్‌కు లైసెన్స్‌ ఇస్తున్నారని వివరించారు. కార్పొరేట్లకు అప్పగించేందుకు మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తున్నారని చెప్పారు. మద్దతు ధర లేకుండా వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద రైతులు బతకాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. భారత్‌ బంద్‌ చివరి పోరాటం కాదనీ, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలంటే కాషాయ శక్తులను అడ్డుకోవాలని కోరారు. ఆరేండ్లుగా ఎన్డీయేకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో బీజేపీ పెరిగేందుకు కారణమని విమర్శించారు. ప్రాంతీయ పార్టీల మనుగడ కొనసాగాలంటే బీజేపీని వ్యతిరేకించాలని సూచించారు. కేరళ తరహాలో విద్యుత్‌ సవరణ బిల్లును అమలు చేయబోమని కేసీఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.
24 గంటలు రైతులతో కూర్చోగలరా? : మోడీ, షాకు నారాయణ సవాల్‌
ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో 24 గంటలు రైతులతోపాటు ఆందోళనలో కూర్చోగలరా?అని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సవాల్‌ విసిరారు. ఎన్డీయే మిత్రపక్ష పార్టీలూ ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఇంతకాలం మోడీకి అనుకూలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ ఇప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడాన్ని స్వాగతించారు. ఏపీ సీఎం జగన్‌ ఇంకా ఊగిసలాట ధోరణిలో ఉన్నారని అన్నారు. రైతాంగం నడ్డివిరిచే ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మందబలంతో పార్లమెంటులో చట్టాలను ఆమోదించి రైతులకు ఉరితాడు బిగిస్తున్నారని విమర్శించారు. మద్దతు ధర లేకుండా, మార్కెట్‌ కమిటీల్లేకుండా అంబానీ, అదానీలకు వ్యవసాయరంగాన్ని అప్పగిస్తున్నారని చెప్పారు. మోడీ సర్కారు మాటలను ఎవరూ నమ్మరనీ, ఈ చట్టాలను రద్దు చేయాలని కోరారు.
వ్యవసాయంపై గుత్తా కార్పొరేట్‌ సంస్థల ఆధిపత్యం : ఈ చట్టాలతో వ్యవసాయరంగంపై గుత్తా కార్పొరేట్‌ సంస్థల ఆధిపత్యం పెరుగుతుందని టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ అన్నారు. కల్తీ విత్తనాలు, పురుగుమందులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనాలని కోరారు. పోడు భూములకు రక్షణ కల్పించాలనీ, రైతు హక్కులను కాపాడాలని సూచించారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ మోడీకి రైతుల మీద కంటే అంబానీ, అదానీ, అమెరికా మీదే ఎక్కువ ప్రేమ ఉందని చెప్పారు. రైతు బజార్లు కాకుండా రిలయెన్స్‌ మార్ట్‌లుండాలని చట్టాలు తెస్తున్నారని విమర్శించారు. సొంత భూమిలోనే రైతులు కూలీలుగా మారతారని అన్నారు. ఈ చట్టాలు అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేసీఆర్‌కు సూచించారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అచ్యుత రామారావు మాట్లాడుతూ నల్లచట్టాలతో ఈ దేశాన్ని చీకటిరాజ్యంగా మారుస్తున్నారని విమర్శించారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదు మరణశాసనం రాసే ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర నాయకులు మురహరి మాట్లాడుతూ భగత్‌సింగ్‌ స్ఫూర్తితో రైతులు ఢిల్లీలో పోరాడుతున్నారని అన్నారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్‌, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రాజేష్‌, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క, జమాతే ఇస్లామి నేత అబ్దుల్‌ ఖదీర్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా తెచ్చిన ఈ చట్టాలను రద్దు చేసేంత వరకూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ అన్నం పెట్టే రైతులకు సున్నం పెట్టే ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశం కోసం జరిగే ఈ పోరాటానికి అందరూ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెరుపల్లి సీతారాములు, నంద్యాల నర్సింహ్మారెడ్డి, డిజి నరసింహారావు (సీపీఐఎం), అజీజ్‌పాషా, ఈటి నరసింహా (సీపీఐ), కె రమ, కె రంగారెడ్డి (న్యూడెమోక్రసీ), వల్లెపు ఉపేందర్‌రెడ్డి (ఏఐకేఎఫ్‌), టి సాగర్‌ (రైతుసంఘం), పశ్యపద్మ (రైతు సంఘం), టి జ్యోతి, ఆశాలత, అరుణజ్యోతి (ఐద్వా), ఆర్‌ వెంకట్రాములు, బి ప్రసాద్‌ (వ్యవసాయ కార్మిక సంఘం), ఎండి అబ్బాస్‌ (ఆవాజ్‌), జావేద్‌, అశోక్‌రెడ్డి (ఎస్‌ఎఫ్‌ఐ), విజరుకుమార్‌, మహేందర్‌ (డీవైఎఫ్‌ఐ), స్కైలాబ్‌బాబు, విజరుకుమార్‌ (కేవీపీఎస్‌), ధర్మానాయక్‌, శ్రీరాంనాయక్‌ (టీజీఎస్‌), నరేష్‌, శ్రీమాన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌), రణధీర్‌ (ఏఐకేఎంఎస్‌), సంధ్య (పీవోడబ్ల్యూ), పరుశురాం (పీడీఎస్‌యూ), ఎస్‌ఎల్‌ పద్మ, అరుణ, ప్రవీణ్‌, హన్మేష్‌, కిరణ్‌ (ఐఎఫ్‌టీయూ), ప్రదీప్‌ (పీవైఎల్‌), రాము, అనిల్‌, రాజేందర్‌ (పీడీఎస్‌యూ) తదితరులు పాల్గొన్నారు.

 68 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.