September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అంతులేని జాప్యం…

1 min read

AAB NEWS : శాశ్వత ఈవో లేక అవస్థలు

‘సింహాచలం’లో సమస్యలెన్నో

అడవివరం

లాక్‌డౌన్‌ సమయంలో ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు

వాటిపై దేవాదాయశాఖ విచారణ..

అప్పటి ఈవో వేంకటేశ్వరరావును మాతృశాఖకు పంపడం

ఆపై విజిలెన్స్‌ దర్యాప్తు.. భూముల పరిరక్షణ విభాగాధిపతి ఎస్‌డీసీ (స్పెషల్‌ డిప్యుటీ కలెక్టర్‌)బదిలీ..

తాత్కాలిక ఈవోగా సంయుక్త కమిషనర్‌ భ్రమరాంబ నియామకం..

తూతూమంత్రంగా పాలకమండలి సమావేశం..

కొన్ని అంశాలపై ఛైర్‌పర్సన్‌తో విభేదించి విధుల నుంచి తప్పుకున్న భ్రమరాంబ..

అన్నవరం ఈవో త్రినాథరావుకు అదనపు బాధ్యతలు..

సందట్లో సడేమియాగా భక్తులు సమర్పించిన కానుకలు మాయమవడం

-ఇలా వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు…ఘటనలు ‘సింహాచలం’ దేవస్థానంలో

ఏం జరుగుతోంది? అనే సందేహాలకు కారణమవుతున్నాయి.

సిం హాచలం దేవస్థానానికి సంబంధించి ఏదొక అంశం వివాదాలకు దారి తీస్తోంది. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి కొద్ది నెలలుగా శాశ్వత ఈవో లేకపోవడం ఎన్నో అంశాల్లో సమస్యగా మారింది. ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారిని నియమించాలని భావించినా… ఎప్పుడు…ఎవరిని నియమిస్తారన్నది తేలడం లేదు.

అదనపు బాధ్యతలతో..అవస్థలు: వైదిక పెద్దలతో సమన్వయం, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ, భక్తులు, ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి శాశ్వత ఈవో ఉండాలి. అటువంటిది ఆరు నెలలుగా పూర్తిస్థాయి అధికారి లేకుండానే నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం అన్నవరం ఈవో త్రినాథరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయనకు అక్కడే పని ఒత్తిడి ఉంది. కార్తికమాసంలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉండడంతో సమయం చిక్కక పూర్తిస్థాయిలో సేవలందించలేకపోతున్నారు. వారానికి ఒకటి, రెండు సార్లు వచ్చి ఒక పూట ఉండి దస్త్రాలపై సంతకాలు చేసి వెళ్తున్నారు.

మరెన్నో సమస్యలు

స్థానికంగా ఈవో ఉంటే భక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులు ఎప్పటికపుడు పరిష్కరించేందుకు వీలవుతుంది. తరచూ పులిహోర ప్రసాదం భక్తులకు అందడం లేదు. తగినంత సిబ్బంది లేక సరిపడా చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.

కొవిడ్‌ ఆంక్షలతో తలనీలాల సమర్పణకు ఇబ్బందులు వస్తున్నాయి. ఆంక్షల కారణంగా చిన్నారులు, వృద్ధులు మొక్కులు చెల్లించుకోలేకపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా భక్తులే కొండ దిగువన అనధికారికంగా చేయించుకుంటున్నారు. శాశ్వత ఈవో ఉంటే వెంటనే కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే వీలుండేది. కొవిడ్‌ నిబంధనలు కొన్ని సార్లు అమలు కావడం లేదు.

ఉద్యోగుల వేతనాలపై ఆలోచించేవారే లేరనే విమర్శలొస్తున్నాయి. కొన్ని నెలలుగా సగం వేతనాలతోనే నెట్టుకొస్తున్నారు. మూడు నెలలుగా సెక్యూరిటీ గార్డులకు వేతనాలే లేవు. విశ్రాంత ఉద్యోగులు పూర్తిస్థాయి వేతనాలు ఇప్పించాలని డిమాండు చేస్తున్నారు. ఇటీవల దేవస్థానానికి ట్రాన్స్‌కో నుంచి వచ్చిన రూ.5 కోట్ల వినియోగంపై న్యాయసలహా కోరినప్పటికీ ఆ తరువాత బాధ్యత తీసుకునేవారు కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

పాలకవర్గం భేటీ ఎప్పుడో?

ఆలయం అభివృద్ధి చెందాలంటే మౌలికవసతులు కల్పించాలి. ఇందుకు పాలకమండలి సమావేశం అవసరం. ప్రతి నెలా, తప్పని పక్షంలో మూడు నెలలకోసారి ఈ సమావేశం నిర్వహించాలి. ఆగస్టు 27న నామమాత్రంగా నిర్వహించారు. రెండు వారాల తరువాత మళ్లీ నిర్వహిస్తామని చెప్పి ఇప్పటివరకు నిర్వహించలేదు.

భూముల పరిరక్షణ విభాగానికి కీలక అధికారి లేకపోవడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం…

శాశ్వత ఈవో లేకపోవడంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యమవుతోంది. తాజాగా నృసింహస్వామి దీక్షల విషయంలో వైదిక పెద్దలు, భక్తిపీఠాల మధ్య సమన్వయం కుదరలేదు. అంశం చిన్నదైనా దేవాదాయశాఖ కమిషనరుకు లేఖ రాసే వరకు వచ్చింది.

ఈ నెల మూడో వారంలో జరిగే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు.

 272 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.