AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే …

1 min read

AAB NEWS :

సమసమాజ స్థాపనకోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు # మహాత్మాజోతిరావ్ఫూలే

భారతదేశంలో మొట్టమొదటి నిజమైన ‘మహాత్మా’

నిచ్చెనమెట్ల వర్ణ, కుల వ్యవస్థకు ప్రాణం పోసిన ”మనుస్మతి”కి, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిరావు ఫూలే అవిశ్రాంతంగా పోరాటం చేసాడు. మమతానురాగాల మానవీయ సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసాడు. సైద్ధాంతిక, విద్యా రంగాల్లో ఉద్యమాలను నిర్మించడం, వాటికోసం సంస్థలను నెలకొల్పడం వంటివి చేశాడు.

జోతిరావు ఫూలే చేసిన కృషిని, ప్రభావాన్ని చాటిచెప్పేందుకు 1888 మే 11న పూణేలో పెద్ద బహిరంగసభ జరిగింది. వేలాది మంది ప్రజల సమక్షంలో జోతిరావు ఫూలే ”మహాత్మ” అనే బిరుదుతో సత్కారం పొందాడు.
పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు. నడుస్తున్న కాలానికి వ్యాఖ్యానం అక్కర లేదు. కానీ వక్రీకరించబడ్డ చరిత్రకు పునర్‌ నిర్వచనం అవసరం. భారతదేశంలో ఆధిపత్య బ్రాహ్మణీయ విషసంస్కతి వాస్తవాలను సమాధి చేసింది. అందుకే ”ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కన్పించని కథలన్నీ కావాలిప్పుడు”.
‘మహాత్మ జ్యోతిరావు ఫూలే’ను తన గురువు అని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ప్రకటించిన విషయాన్నీ వెలుగులోకి రానీయలేదు. ఉద్దేశపూర్వకంగానే బడుగు జన మేధావుల గొప్పతనాన్నీ, నాయకుల విశిష్టతనూ, పోరాటయోధుల చరిత్రనూ కనుమరుగు చేసారు. కట్టుకథలు చెప్పారు.

జ్యోతిరావు 1827 ఏప్రిల్‌ 11న పూణేలో జన్మించాడు. తల్లి చిమ్నాబాయి, తండ్రి గోవిందరావు.
సమాజంలో సగభాగమైన మహిళలు అభివద్ధి చెందకుండా సమాజం పురోగతి చెందదని ఫూలే నమ్మాడు. అందుకే స్త్రీలు విద్యావంతులు కావాలని భావించాడు. ఇతరులకు ఆదర్శంగా ముందు తన భార్య సావిత్రిని చదివించాడు. సావిత్రిబాయిని 1846 -1847లో అహ్మదాబాద్‌లో టీచర్‌ ట్రైనింగ్‌కు పంపించాడు. ఆమెతోపాటు ఫాతిమా షేక్‌ అనే ముస్లిం మహిళ కూడా శిక్షణ పొందింది.

చదువుకునే హక్కులో అందరికీ సమానత్వం కల్పించాలని నాటి హంటర్ కమీషన్ కు వినతిపత్రం సమర్పించిన మహాత్మా ఫూలే.
తన భార్య సావిత్రిబాయితో కలిసి 1848లో తొమ్మిది మందితో దేశంలోనే తొలి బాలికల పాఠశాలను ప్రారంభించారు. పూలే దంపతులు అనేక సంస్కరణలు చేపట్టి సామాజిక విప్లవానికి బాటలు వేసారు
స్వేచ్ఛ, సమానత్వం, ఐక్యమత్యం, మానవత్వంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు పూలే. శూద్రులను, అతిశూద్రులను భావదాస్యం నుంచి విముక్తుల్ని చేయాలని భావించాడు. ప్రగతిశీల భావజాల వ్యాప్తికోసం ఫూలే సాహిత్యాన్ని, పత్రికారంగాన్ని ఎంచుకున్నాడు. ”గులాంగిరి”, ”తృతీయరత్న”, ”పౌరోహిత్యం బండారం”, సార్వజనిక సత్యధర్మం”, ”సేద్యగాడి చెర్నకోల”, ”హెచ్చరిక” తదితర ఎన్నో గ్రంథాలు రాసి, ప్రచురించాడు. అంతేకాదు ”దీనబంధు” అనే వారపత్రికను ప్రారంభించాడు. కార్మికుల, కర్షకుల సమస్యలు, బీదల బాధలు, ఇతర సామాజిక సమస్యలెన్నో ఈ పత్రికలో అచ్చయ్యేవి…….
సామాజిక ప్రజాస్వామ్యం సాధించటమే భారతదేశానికి ముఖ్యమని మహత్తర సందేశం ఇచ్చిన మహాత్మ జ్యోతిరావు ఫూలే తన గురువు అని భారత రాజ్యంగ నిర్మాత డా.బిఆర్‌. అంబేద్కర్‌ ప్రకటించాడు. సమసమాజ స్థాపన కోసం నిరంతరం తపిస్తూ అనారోగ్యంతో ఫూలే 1890 నవంబర్‌ 28న మరణించాడు. కుల వివక్షను ఎదిరించి బహుజనుల బతుకుల్లో వెలుగు రేఖలు ప్రసరింపజేసిన క్రాంతిజ్యోతి. వెట్టి బతుకుల్లో తొలిపొద్దు మహాత్మ “జ్యోతిరావు ఫూలే”కు జోహార్లు.
భారతదేశ సామాజిక విప్లవోద్యమంలో, సంఘ సంస్కరణోద్యమంలో తన భర్తతో సమానంగా పోరాడిన సాహస వనిత “సావిత్రిబాయి”కి జోహార్లు.

 392 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.