AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎంత దౌర్భాగ్యం…

1 min read

AABNEWS : ప్రభుత్వ వైద్యం ఏ మూలకూ చాలదు. కార్పొరేట్‌ వైద్యం అందనంత ఖరీదు. అటువంటి దయనీయ స్థితిలో నేడు అసంఖ్యాకంగా పేదలు ఉన్నారు. ఏ చిన్న ఆశ కనిపించినా, ఏ చిన్న ఆధారం దొరికినట్టు అనిపించినా, ఆశగా దానికోసం వారు ఎగబడతారు. ఇది వారి నిస్సహాయ స్థితికి ప్రతిబింబమే కాని చైతన్యపూరితంగా ఆ ప్రజలు కోరుకునేది కాదు. కాబట్టి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని ప్రజల మీదకు ”వారు కోరుకుంటున్నారు” అనే పేరుతో నెపాన్ని నెట్టేసి నాటు వైద్యాన్ని సమర్ధించడం తప్పు. తప్పే కాదు, నేరం కూడా.నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర ఆనందయ్య అనే నాటు వైద్యుడు ఇచ్చే మందు కరోనాను నయం చేస్తుందన్న ప్రచారం దుమారంలా వ్యాపించింది. రెండు రోజుల క్రితం అక్కడ వేలాదిగా గుమిగూడిన జనాలను చెదరగొట్టడానికి లాఠీచార్జి కూడా చేయవలసి వచ్చింది.ఆ మందును, ప్రజలపై దానిని ప్రయోగిస్తున్న విధానాన్ని పరిశీలించిన ఆయుష్‌ వైద్యుడు అది ఆమోదం పొందిన ఆయుర్వేద ఔషధం కాదని, ఆనందయ్య అర్హతలున్న ఆయుర్వేద వైద్యుడు కాడని, ఆ మందు పని చేస్తుందో లేదో నిర్ధారించాల్సి వుందని స్పష్టంగా నివేదిక ఇచ్చారు. దాంతో తాత్కాలికంగా ఆ కార్యక్రమం ఆగింది.ఆనందయ్య వాడిన మందు పని చేస్తుందో లేదో తేల్చడానికి అవసరమైన పరీక్షలను జరిపి నిగ్గు తేల్చాల్సినది ఐసిఎంఆర్‌ అని, ఆనందయ్య తయారు చేసిన మందును నాటుమందుగానే పరిగణిస్తున్నామని ఆయుష్‌ కమిషనర్‌ రాములు స్పష్టంగా ప్రకటించారు. ఈలోపు ఆనందయ్య ఇచ్చిన మందు వికటించి రోగులలో కొందరి పరిస్థితి విషమంగా తయారైనట్టు వార్తలు కూడా వచ్చాయి.కాని ఒక్కరోజు లోనే మొత్తం సీన్‌ మారిపోయింది !తిరుపతి ఆయుర్వేద కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ఒకాయన అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వహించిన పత్రికాగోష్టిలో ”నాటి మందు”నే ఇప్పుడు ”నాటు మందు” అంటున్నారని తెలుగు భాషకు కొత్త భాష్యం చెప్పారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఆనందయ్య మందు హాని చేస్తున్నట్టు ఎటువంటి దాఖలాలూ లేవని, ఆయుర్వేదం మందు అయితే నిబంధనలు వర్తిస్తాయి గాని, అది ఆయుర్వేదం మందు కానట్టయితే ఏ నిబంధనలూ వర్తించవని అత్యంత హాస్యాస్పదమైన, బాధ్యతా రహితమైన ప్రకటన చేశారు!ముఖ్యమంత్రి అండ తనకు ఉన్నదంటూ ఆనందయ్య మీడియా ముందు ప్రకటించాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆనందయ్య వైద్యానికి మద్దతు తెలిపారు. స్వయానా ఉపరాష్ట్రపతి అసాధారణ రీతిలో ఒక కేంద్ర బృందాన్ని పంపి ఆనందయ్య మందుకు ఇమేజ్‌ పెంచారు. ఇంతమంది రంగంలో ఉంటే మనం ఎక్కడ వెనకబడిపోతామనో ఏమో గాని సిపిఐ నాయకులు నారాయణ కూడా దీనిని సమర్ధిస్తూ మాట్లాడారు.ఆయుర్వేదం, యునానీ, హోమియో, ఆక్యుపంక్చర్‌, యోగా తదితర సాంప్రదాయ వైద్య విధానాలు చాలానే ఉన్నాయి. వాటికి నాటు వైద్యానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ సాంప్రదాయ వైద్యాలను ఆధునిక శాస్త్త్ర విజ్ఞానం సహకారంతో అధ్యయనం చేసి శాస్త్రబద్ధం చేయాల్సిన అవసరాన్ని ప్రపంచం గుర్తించి అనేక సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతోంది. ఆ క్రమంలోనే కొన్ని రకాల వైద్యాలను గుర్తించి అనుమతిచ్చింది. ఆయుర్వేదం, యునానీ, హోమియో వైద్య విద్యలకు సిలబస్‌లను రూపొందించి కళాశాలలు ఏర్పాటు చేశారు. డిగ్రీలు ప్రదానం చేసి ప్రాక్టీస్‌ కు అనుమతులిచ్చారు.కాని ఇప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో సైతం నాటువైద్యం కొనసాగుతోంది. దానికి ఎటువంటి నియంత్రణా లేదు. కాని దానిని ప్రభుత్వం ఎక్కడా ఆమోదించి అనుమతించనూ లేదు. గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలలో భాగంగా నాటువైద్యం జోలికి పోవద్దన్న ప్రచారం జరుగుతూనే వుంది. ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా కూడా ఇటువంటి ప్రచారాలు జరిగాయి. నాటువైద్యం వికటించి ప్రాణాలు పోగొట్టుకునేవారి గాధలు నిరంతరం వినవస్తూనే వుంటాయి.ఇక తాయెత్తులు, పోగులు కట్టడం, రాగిరేకులు మంత్రించి ఇవ్వడం, భూత వైద్యం, చేతబడి, ఎరుకలసాని మందులు, పుత్తూరు వైద్యం వంటివి నాటువైద్యం రూపాలు, ప్రజల్లో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలకు ప్రతీకలు.
ప్రజలు వీటిని అధిగమించి ఆధునిక, శాస్త్రీయ వైద్య పద్ధతులను అనుసరించి ఆరోగ్యాలను కాపాడుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు, బాధ్యతగల అధికారులు, రాజకీయ నాయకులు వ్యవహరించాలి. అందుకు తగిన ఆధునిక వైద్య వసతుల కల్పనకు కృషి చేయాలి.ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు. అది జీవించే హక్కులో భాగమే. దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టే నాటు వైద్యాలను నియంత్రించే బాధ్యత కూడా ప్రభుత్వాలదే. మరి ఆ బాధ్యతను విస్మరించి, అందునా, ఆరోగ్యపరంగా ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు, కొన్ని రాజకీయ పార్టీలు, అధికారులు ఎందుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆనందయ్య మందును సమర్ధిస్తున్నారు ?ప్రజలు వేలాదిగా ఆ మందుకోసం వస్తున్నారు కాబట్టి సమర్ధిస్తున్నాం అని చెప్పడంలో అర్ధం లేదు. ఎక్కడికక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, జనరల్‌ హాస్పిటళ్లు, ఈ కరోనా కాలంలో ప్రజల ఆరోగ్యాన్ని సరైన విధంగా, సకాలంలో సంరక్షించే సామర్ధ్యంతో నడిస్తే ప్రజలు నాటువైద్యానికి ఎందుకు వస్తారు? కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే.అదీ చాలదన్నట్టు, ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులను విపరీతంగా పెంచి పోషించినదీ ఈ ప్రభుత్వాలే. మెడికల్‌ రీఇంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటివి ప్రజాధనాన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల పాలు చేయడానికి తోడ్పడిన, తోడ్పడుతున్న మార్గాలు. పైగా కార్పొరేట్‌ ఆస్పత్రులను నియంత్రణ చేసే చర్యలేవీ లేవు.లాభార్జనే కాని ప్రజారోగ్యం పట్టని కార్పొరేట్‌ ఆస్పత్రులు ఈ కరోనా కష్టకాలంలో చేతులెత్తేసి తమ చేతకానితనాన్ని బైటపెట్టుకున్నాయి. ఈ సమయంలో కూడా లక్షలు ప్రతీ కరోనా రోగి నుండీ పిండుకుంటున్నాయి. ఈ పరిస్థితి పూర్తిగా ప్రభుత్వాలు (కేంద్రం, రాష్ట్రం) కల్పించినదే.

 

 1,704 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.