ఏపీకి కరోనావైరస్ సెకండ్ వేవ్ ముప్పు…
1 min read
AABNEWS : దేశంలోకి కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ఎంటరయిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా కోవిడ్ సెకండ్‌వేవ్ వస్తోందన్న సమాచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఆస్పత్రుల్లో నాడు-నేడుపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటికే బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలు విధించారని, రాష్ట్రంలో పరిస్థితులను కూడా జాగ్రత్తగా గమనిస్తుండాలని సూచించారు. ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇప్పుడున్న సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న సౌకర్యాలను అధికారులు సీఎంకు వివరించారు. వ్యాక్సిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని తెలిపారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ, వ్యాక్సిను వాటి పనితీరుపై బ్రిటన్ వంటి దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యాక్సిన్ విషయంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో కూడా వ్యాక్సిన్లను నిల్వ చేసే సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీకి ఇప్పుడున్న సదుపాయాలపై అధికారులు వివరాలు అందించారు. వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం, సిబ్బంది ప్రభుత్వానికి ఉన్నారని అధికారులు వెల్లడించారు.
190 Total Views, 2 Views Today