AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గూడూరు శ్రీమంతుడు ఆపన్న హస్తం…

1 min read

AABNEWS : వృద్ధ ఆనాధ మహిళకు గూడూరు శ్రీమంతుడు ఆపన్న హస్తం…
కూలిన పూరింటి స్థానంలో పక్కా గృహం…
కనుమూరు సేవలు స్ఫూర్తిదాయకం..
సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ
ఫోటో రైటప్స్ : అనాధ వృద్ధ మహిళకు పక్కా గృహ తాళాలు అందిస్తున్న దృశ్యంఇంటిని పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ మాట్లాడుతున్న సబ్ కలెక్టర్
గూడూరు : నెల రోజుల క్రితం నివర్ తుపాన్ వలన కురిసిన వర్షాలకు ఓ అనాధ వృద్ధ మహిళ పూరిళ్లు కూలిపోయింది. ఓ వైపు జోరు వర్షం.. మరో వైపు ఆదుకునే వారు లేక మూడు రోజులు పస్తులతో ఆ వృధ్ధురాలు అలమటించింది. ఈ దుస్థితి గూడూరు పట్టణానికి సమీపంలో ఉన్న గాంధీనగర్ దండోరా కాలనీలో చోటుచేసుకుంది. ఆ కాలనీకి చెందిన చెందులూరు సుబ్బమ్మ పాచి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. నెల రోజుల క్రితం ఆమె పూరిల్లు నివర్ తుఫాన్ తో కూలిపోయింది. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న వలంటీర్లు, సచివాలయ కార్యదర్శుల దృష్టికి సుబ్బమ్మ తీసుకెళ్లింది. అధికారుల నుండి ఎటువంటి స్పందనా లేదు. దీంతో స్థానికంగా ఉన్న కొంతమంది ఆమెకు నగదు, ఫల సరుకులు అందించారు. ఈ విషయం లోకల్ ఛానెల్ లో ప్రసారమైంది. సీఆర్ ఛానల్ అధినేత, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, గూడూరు శ్రీమంతుడు కనుమూరు హరిచంద్రారెడ్డి వెంటనే స్పందించారు. ఆయన పట్టణంలో లేకపోయినప్పటికీ కనుమూరు హరిచంద్రారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులను గాంధీనగర్ కు పంపించారు. కూలిన ఇంటిని పరిశీలించారు. ఆమె అనాధ వృద్ధురాలని తెలుసుకున్నారు. నెల రోజులలో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. చెప్పిన విధంగానే వర్షం కురుస్తున్నా పనులు ఆపకుండా నెల రోజులలో పక్కా గృహాన్ని నిర్మించారు. మంగళవారం ఆయన సబ్ కలెక్టర్ చేతుల మీదుగా సుబ్బమ్మకు ఇంటి తాళాలు అప్పగించారు. దీంతో ఆ వృద్ద మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ కనుమూరు హరిచంద్రారెడ్డి సేవలకు అవధుల్లేవని కొనియాడారు. లెక్కలేనన్ని స్వార్థ రహిత సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. దాతలు సాధారణంగా ఏదో రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలోనే సహకారం అందిస్తుండడం పరిపాటి అన్నారు. ఆయితే దీనికి పూర్తి భిన్నంగా కనుమూరు హరిచంద్రా రెడ్డి అధ్యాత్మిక రంగం, క్రీడా రంగం, విద్య, వైద్య రంగాలలోనూ సేవలందించడం ఆదర్శనీయమన్నారు. కరోనా సమయంలో టిడ్కో భవనాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ కు పరికరాలు అందించారని, దురదృష్టవశాత్తు చనిపోయిన రోగులకు వైకుంఠ వాహనం అందుబాటులో ఉంచారని కనుమూరు సేవలను గుర్తుచేశారు. ట్రాఫిక్ సమస్య నివారించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లు లేని నిరుపేదలుంటే వారందరికీ గాంధీనగర్ లే అవుట్ లో అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే చెరువు ఆక్రమణల తొలగింపుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. సుబ్బమ్మకు పింఛన్, అభయ హస్తం, రేషన్ కార్డు సౌకర్యం కల్పించామన్నారు. అలాగే నివర్ తుపాన్ తో ఇల్లు కోల్పోయిన సుబ్బమ్మకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుబ్బమ్మకు పక్కాగృహం నిర్మించి ఇచ్చిన కనుమూరు హరిచంద్రారెడ్డి, ట్రస్ట్ సభ్యులను ఆయన అభినందించారు. కేహెచ్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కనుమూరు హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ నివర్ తుపాన్ తో చెందులూరు సుబ్బమ్మ అనాధ వృద్ధ మహిళ పూరింటి స్థానంలో మూడు వారాలలో పక్కా గృహం నిర్మించి సంక్రాంతి కానుకగా అందించామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. నిధులన్నీ సంక్షేమ కార్యక్రమాలకు సరిపోతున్నాయన్నారు. దీంతో గూడూరు చెరువు అభివృద్ధిలో జాప్యం చోటుచేసుకుంటోందన్నారు. పట్టణ ప్రజలకిచ్చిన అన్ని హామీలు గుర్తున్నాయన్నారు. ఎమ్మెల్యే సహకారంతో చెరువు అభివృద్ధికి కనీసం కోటి రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. వందల ఎకరాలు ఆక్రమణకు గురై ఉన్నాయన్నారు. సబ్ కలెక్టర్ స్పందించి ఆక్రమణల తొలగింపుకు శ్రీకారం చుడితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. త్వరలోనే ఒక పక్కా కార్యాచరణ ప్రణాళికతో చెరువు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సుబ్బమ్మకు పక్కాగృహం నిర్మించేందుకు దగ్గరుండి పనులను పర్యవేక్షించిన ట్రస్ట్ సభ్యులు, వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అనాధ అయిన సుబ్బమ్మకు చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు సహకరించాలని సూచించారు. వలంటీర్ ఆమె ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. అనంతరం స్థానికులు సబ్ కలెక్టర్, కనుమూరు హరిచంద్రారెడ్డిలను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేహెచ్ఆర్ ట్రస్ట్ సభ్యులు సీహెచ్. అనిల్, దేవానంద్, ఉదయ్ కుమార్ (బుజ్జి), ప్రతాప్, సాయి, రామయ్య, పెంచలయ్య, కిషోర్ పలువురు ట్రస్ట్ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 242 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.