భారత్ బంద్ కు ఏఐవైఎఫ్, ఇన్సాఫ్,ఏఐటీయూసీల మద్దతు…
1 min read
AAB NEWS : ఈ నెల 8వ తేదీన జరిగే భారత్ బంద్ కు ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్, ఇన్సాఫ్ కమిటీలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని ఆయా కమిటీల నాయకులు తెలిపారు. ఆదివారం స్థానిక కటకరాజావీధిలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సునీల్ యాదాల మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్లచట్టాలు, కేంద్ర విద్యుత్ సవరణ చట్టం వలన యావత్ భారతదేశంలోని రైతాంగానికి, కార్మికులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఆ బిల్లులు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు వాన, చలికి వెనుకాడకుండా దీక్షలు చేపడుతున్నారన్నారు. 8వ తేదీన నిర్వహించనున్న భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. ఇన్సాఫ్ కమిటీ గూడూరు డివిజన్ అధ్యక్షులు షేక్. జమాలుల్లా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ రైతులను లక్ష్యం చేసుకుందన్నారు. రైతు బిల్లులు, కేంద్ర విద్యుత్ సవరణ చట్టం రైతులను ఇరకాటంలో పెట్టి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేవిధంగా ఉన్నాయన్నారు. విద్యుత్ రైతులకు స్వేచ్ఛ అంటూ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు స్వేచ్ఛ కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర లభించకపోగా కార్పొరేట్ సంస్థలు ఇష్టానుసారంగా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించుకునేందుకు ఈ రైతు బిల్లులు అవకాశం కల్పిస్తుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు రైతులు చేపట్టే భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ పట్టణాధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
26 Total Views, 2 Views Today