చేతకాని ప్రభుత్వం…
1 min read
AAB NEWS : ఏలూరులో వింత జబ్బు బాధితుల సంఖ్య 443కి పెరిగింది. ప్రధానంగా మూర్ఛ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. కాగా, ఇప్పటివరకు 243 మంది కోలుకున్నారు. మరికొందరిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. బాధితుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపువారే ఉన్నట్టు గుర్తించారు.ఏలూరు ఘటనలు చేతకాని ప్రభుత్వమే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడుతున్నారు. ఎంతసేపూ టీడీపీని ఎలా దెబ్బతీయాలన్న ఆలోచన తప్ప, పాలనపై దృష్టి సారించడంలేదని, ఏలూరు ఘటనకు బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. అప్పులు చేయడంపై ఆసక్తి చూపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ లేదని.. ఏలూరులో బాధితులకు అసలేం జరిగిందో తెలుసుకోకుండానే చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. బాధితుల సమస్యలకు కారణాలు తెలియవని అనడం వితండవాదం కాక మరేమిటి? అని అన్నారు. ఓ క్రమపద్ధతిలో పారిశుద్ధ్యం నిర్వహిస్తే ఇలాంటి కష్టాలు ఉండవని చంద్రబాబు అంటున్నారు.
ఈ ఘటనకు ఏలూరు మున్సిపాలిటీ పంపిణీ చేసే నీరే కారణమనే ప్రచారం జరుగుతూ ఉండగా.. ఆ నీళ్లు తాగని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు సైతం ఈ అంతుచిక్కని వ్యాధిపై ఏమి చెప్పలేకపోతున్నారు. ఈ అనారోగ్యానికి సంబంధించిన కారణాలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ నిపుణులు దర్యాప్తు కోసం ముందుకు వచ్చారు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) సహకారం కోరింది. ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి దర్యాప్తు చేయాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సోమవారం సాయంత్రంలోగా లేదా మంగళవారం ఏలూరుకు చేరుకుంటారని తెలుస్తోంది.
108 Total Views, 2 Views Today