AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పోటెత్తిన నివర్…

1 min read

AAB NEWS :

సత్వర సాయం.. సీఎం ఆదేశాలు

♦️తుఫాన్‌ పరిస్థితులపై సీఎంఓ అధికారులతో సమీక్ష

♦️ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

♦️మిగిలిన జిల్లాల్లో కొవిడ్‌ జాగ్రత్తలతో తరగతులు

♦️యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ చర్యలు

♦️ గూడూరు జాతీయ రహదారి అదిశంకర్ కళాశాల వద్ద పొంగుతున్న వాగులు

♦️ చెన్నై- నెల్లూరు రాకపోకలు నిలిచిపోయాయి

♦️నిలువునా మునిగిన రైతన్న

♦️వేలాది ఎకరాల్లో పంటలు మునక

♦️వరి, పత్తి, వేరుశనగకు భారీనష్టం..చేలోనే ముద్దయిన వరి పనలు

♦️దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎడతెరిపి లేని వాన

♦️చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కుండపోత

♦️పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన ‘నివర్‌’

♦️అతి తీవ్ర తుఫాన్‌ నుంచి వాయుగుండంగా మార్పు

♦️చెన్నైలో విలయం

♦️పొంగిపొర్లిన నదులు, వాగులు

♦️గ్రామాలకు నిలిచిన రాకపోకలు

♦️పలుచోట్ల కూలిన భారీ వృక్షాలు

♦️తిరుమల జలమయం

♦️ఘాట్‌రోడ్లపై బండరాళ్లు

♦️ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతి

♦️ముగ్గురిని కాపాడిన సిబ్బంది

నివర్‌… నీళ్లతో ‘నిప్పులు’ చిమ్మింది. హోరు గాలులతో వణికించింది. జోరు వానతో ముంచెత్తింది. రహదారులను కోసేసింది. కోతకొచ్చిన పంటలను ముంచేసింది. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు, ఇళ్లను కూల్చేసింది. మొత్తంగా… జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుఫాను… గురువారం తెల్లవారుజామున పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. భారీ వర్షాలు, పెనుగాలులతో విరుచుకుపడింది. చెన్నై నగరం నీట మునిగిపోయింది. తమిళనాడుకు దగ్గరగా ఉన్న… నెల్లూరు, చిత్తూరు, కడపలో కుండపోత కురిసింది. వాగులూ వంకలూ, చెరువులూ పోటెత్తాయి. రహదారులను వరదనీరు ముంచెత్తడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. విజయవాడలో గురువారం ఉదయం నుంచి చలిగాలులతో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. శుక్రవారం ఉదయం నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి, సరిగ్గా పంటలు కోతకు వస్తున్న సమయంలో కురిసిన వర్షం… అన్నదాతలను నిలువునా ముంచేసింది. వేల ఎకరాల్లో వరి దెబ్బతింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

నెల్లూరు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. పలు కాలనీలు నీట మునిగాయి. జిల్లావ్యాప్తంగా 115 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటిలోకి 3,363 మందికి తరలించారు. ఈదురు గాలులకు పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. నెల్లూరు, గూడూరు, నాయుడుపేట డివిజన్లలో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరులో పంబలేరు వాగు జాతీయ రహదారిపై ప్రవహించడంతో ఆ మార్గంలో ద్విచక్ర వాహనాలు, కార్లను పోలీసులు అనుమతించలేదు

గూడూరు జాతీయ రహదారిపై వరద నీరు

గూడూరు పట్టణ పరిధిలోని అదిశంకర కళాశాల వద్ద జాతీయ రహదారిపై వాగులు పొంగి రోడ్డుపై ఉదృతం గా నీరు ప్రవహిస్తూ ఉండటంతో చెన్నై నెల్లూరు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి,దింతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, పంబేలేరు వాగు చల్ల కాలువలు కూడా పొంగుతున్న నేపథ్యంలో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి,సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ గూడూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు, గూడూరు ఎమ్మెల్యే ఏకంగా అధికారులు తో కలిసి రోడ్లపై కూలిన చెట్లను తొలగించే కార్యక్రమాలు చేపట్టారు,

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో బుడగట్లపాలెం గ్రామానికి చెందిన కారి సందెయ్య(65) గురువారం సముద్ర ం ఒడ్డున గేలంతాడుతో చేపలు పడుతుండగా కెరటాల ఉధృతికి కొట్టుకుపోయాడు. తోటి మత్స్యకారులు ఎంత ప్రయత్నించినా అతడిని కాపాడలేకపోయారు.

చిత్తూరు జిల్లాలో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు, చెరువులూ దాదాపుగా నిండిపోయాయి. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 30 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

గల్లంతైన యువకుడిని కాపాడారు

చిత్తూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శేషాచలం కొండలు, అడవుల నుంచీ వర్షపు నీరు వచ్చి చేరడంతో మల్లిమడుగు రిజర్వాయర్‌ గురువారం తెల్లవారుఝామున నిండిపోయింది. అధికారులు గేట్లన్నీ ఎత్తేశారు. ఆ నీరు ఉధృతంగా రాళ్లవాగులోకి ప్రవహించింది. వరద వచ్చే అవకాశం ఉన్నందన ఆ వాగులో అమర్చిన వ్యవసాయ మోటర్‌ను తెచ్చుకునేందుకు ఆర్‌.మల్లవరం పంచాయతీ కుమ్మరపల్లెకు చెందిన ప్రసాద్‌(34), లోకేశ్‌(22), వెంకటేశ్‌(20) ఉదయం 9 గంటలకు రాళ్లవాగులోకి వెళ్లారు. ఒక్కసారిగా వరద ప్రవాహం వస్తుండటంతో ముగ్గురూ వాగులోని చెట్ల కొమ్మలు పట్టుకున్నారు. చెట్టు కొమ్మ విరిగి కాలికి తీవ్ర గాయమైన ప్రసాద్‌ కొద్దిసేపటికే ప్రవాహంలో కొట్టుకుపోయాడు. చిత్తూరు నుంచి స్పీడు బోటు తెప్పించి, మధ్యాహ్నం 2 గంటల సమయంలో మిగిలిన ఇద్దరినీ కాపాడారు.

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వానలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు వీస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో అన్నవరం సత్యదేవుని తెప్పోత్సవం వాయిదా పడింది. ఉప్పాడలో అలలు రోడ్డుపైకి ఎగసిపడుతున్నాయి. సూరాడపేటలో వెంకటేశ్వరస్వామి ఆలయం గత నెలలో అలల ధాటికి నేలమట్టం కాగా, గురువారం పూర్తిగా సముద్రంలో కలిసిపోయింది. తుఫాను ముప్పుతో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. సముద్రంలో ఇప్పటికే మూడు నౌకలు బియ్యం లోడింగ్‌ కోసం సిద్ధంగా ఉండగా, వాటి వద్దకు బియ్యం లోడుతో వెళ్లే 89 బార్జిలు పోర్టులో ఆగిపోయాయి.

 380 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.