AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రెండు నెలల రేషన్ బియ్యం సరఫరా చేయాలి. గిరిజన సంఘం…

1 min read

AABNEWS : చింతపల్లి ఇంటివద్దకే రేషన్ బియ్యం సరఫరా అని చెప్పిన ప్రభుత్వం రెండు నెలలుగా గిరిజనులకు రేషన్ బియ్యం సరఫరా చేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయ్ మండి పడ్డారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని తాజంగి పంచాయతీ గత్తంపాకలు గ్రామంలో కరోనా 2వ,దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంతో ముద్రించిన కరపత్రాలను కరోనా నిబంధనలు పాటిస్తూ గ్రామాల్లో పంచుతూ గిరిజనులకు అవగాహన కల్పించామన్నారు. దానిలో భాగంగానే గత్తం పాకలు గ్రామానికి వెళ్లిన ఆయనతో స్థానికులు మాట్లాడారన్నారు. బౌడ జిసిసి రేషన్ డిపో ద్వారా ఇంటి వద్దకే రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనం రాక తమకు గత రెండు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కిటుముల పంచాయతీకి చెందిన లక్కవరం, పులిగొంది గ్రామాలకు చెందిన రేషన్ లబ్ధిదారులు బౌడ గ్రామంలోని జిసిసి రేషన్ డిపో వద్దకు నేరుగా వచ్చి రేషన్ సరుకులు తీసుకుంటున్నారన్నారు. ఆయా గ్రామాలలో రేషన్ పంపిణీ చేయవలసిన వాహనం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. తాజంగి పంచాయతీలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. అంతేకాకుండా రేషన్ ఇచ్చే సమయంలో అదనపు సరుకులు ముట్ట చెబుతున్నారని అవి తీసుకోకపోతే బియ్యం ఇవ్వమని బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని, రేషన్ లబ్ధిదారులు తమకు నచ్చిన విధంగా రేషన్ తీసుకునే హక్కు వారికి ఉందన్నారు. బలవంతంగా అదనపు సరుకులు ముట్టచెప్పడం సరికాదన్నారు. ఈ పద్ధతి వెంటనే మార్చకపోతే లబ్ధిదారులతో కలిసి జిసిసి బ్రాంచి కార్యాలయం వద్ద ఆందోళన చేసే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. కరోనా కష్టకాలంలో రోజు గడవడమే కష్టంగా ఉండే ఈ పరిస్థితుల్లో అదనపు సరుకులు ముట్టజెప్పి డబ్బులు గుంజాలనుకోవడం జిసిసి వారికి తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి వద్దకే బియ్యం సరఫరా చేస్తామన్న జగనన్న బియ్యం బండి పథకం పెట్టిన తర్వాత లబ్ధిదారుల పై అదనపు భారంతో పాటు సమయానికి సరుకులు అందడం లేదని దానివల్ల మారుమూల గిరిజన గ్రామాల్లోని లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ఈ పథకం వల్ల గిరిజనులకు ఒరిగేదేమీ లేదన్నారు.అంతే కాకుండా రేషన్ సరుకులు డోర్ డెలివరీ ద్వారా మంచి జరుగుతుందని గొప్పగా చెప్పుకుంటున్న వైసిపి నాయకులు ప్రజల ఇబ్బందుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదని ఆయన దుయ్యబట్టారు.
ఏజెన్సీ మొత్తం మీద రేషన్ పంపిణీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందని ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులపాలు చేస్తుందని ధనుంజయ్ వివరించారు. జిసిసి వ్యవస్థ పై రెవెన్యూ అధికారుల యొక్క పెత్తనం ఉన్నప్పటికీ ఆ శాఖ జిసిసి పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. అందుకోసం రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఉన్నతస్థాయి అధికారులు స్పందించాలని లేకుంటే భవిష్యత్తులో లబ్ధిదారుల ఆగ్రహానికి ప్రభుత్వ అధికారులే బాధ్యత అవుతారని ఆయన హెచ్చరిస్తూ ఆగిన రెండు నెలల రేషన్ బియ్యం లబ్ధిదారులకు వెంటనే సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కొర్ర హేమంత్ కుమార్, రేషన్ లబ్ధిదారులు కిముడు బుద్దు, సీసా ప్రభాకర్, కిల్లో జోక్రో, కిల్లో నాగేశ్వరరావు, కిరిసాని సుమతి, దార, సుభద్ర లు పాల్గొన్నారు.

 167 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.