AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సరిహద్దుల్లోభయం…

1 min read

AAB NEWS : ప్రశాంత వాతావరణానికి నెలవైన విశాఖ మన్యంలో ఉద్విగ్న వాతావరణంలో నెలకొంది. బుధవారం నుంచి మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు హింసాత్మక సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్‌జీఏ) స్థాపించిన నాటి నుంచి ఏటా డిసెంబరు 2 నుంచి 8 వరకూ పీఎల్‌జీఏ వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పీఎల్‌జీఏ స్థాపించి 19 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈసారి వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మావోయిస్టులు ప్రణాళికలు తయారు చేస్తుండగా, వీటిని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు ప్రతివ్యూహం సిద్ధం చేస్తున్నారు. ముందుజాగ్రత్తగా ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులతోపాటు మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను మైదాన ప్రాంతానికి తరలివెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా చూసేందుకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పీఎల్‌జీఏ వారోత్సవాలను జయప్రదం చేయాలని కరపత్రాలు, బ్యానర్ల ద్వారా మారుమూల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

దీనికి ప్రతిగా పీఎల్‌జీఏ వారోత్సవాలను నిలువరించాలనేది పోలీసుశాఖ వ్యూహం. దీనికితోడు ఇటీవల జరిగిన ఎదురుకాల్పులకు నిరసనగా మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మావోయిస్టు ప్రభావిత పోలీసుస్టేషన్ల పరిధిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎస్పీ, ఓఎస్‌డీలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సిబ్బందికి మార్గనిర్దేశం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 384 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.