ఒకరిని చంపి తానే చచ్చినట్లు నమ్మించిన ఘనుడు…
1 min read
AABNEWS : ఒక మిస్టరీ మర్డర్‌ను పోలీసులు చేధించారు. సినిమా స్టోరీని తలదన్నేలా ఉన్న ఈ మర్డర్ మిస్టరీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మిస్టరీని సినిమాగా తీస్తే.. ఖచ్చితంగా హిట్ కొడుతుందని అనిపించకమానదు. కోటి రూపాయల అప్పు ఎగ్గొట్టడానికి ఒక వ్యక్తి తన స్నేహితుడిని చంపి తానే చనిపోయినట్లుగా నమ్మించాడు. ఆ కేసును పోలీసులు చాకచక్యంగా బహిర్గతం చేశారు. ఈ కేసు గురించి పీసీఎంసీ కమిషనర్ కృష్ణ ప్రకాష్ మాట్లాడుతూ.. ‘నవంబర్ 20న హింజెవాడి పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది. ఉడాన్ షాహ్వాలి సమీపంలో ఒక కుళ్లిన మృతదేహం ఉన్నట్లు బానర్‌కు చెందిన మౌలానా ఇన్వెస్టిగేషన్ అధికారి బాలకృష్ణ సావంత్‌కు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుళ్ళిన మృతదేహం దగ్గర పోలీసులు రెండు మొబైల్ నంబర్లు, సగం కాలిన బట్టలు మరియు ఒక చిట్టీని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా ఆ వ్యక్తి కత్తిపోటు కారణంగానే చనిపోయాడని.. ఆ తర్వాత కాల్చారని’ ఆయన తెలిపారు. మృతదేహం వద్ద లభించిన రెండు మొబైల్ నంబర్లలో పోలీసులు ఒక నెంబర్‌కు ఫోన్ చేయగా.. వైసీఎం ఆస్పత్రి ముందుండే ఒక బిచ్చగాడు తన నెంబర్ తీసుకున్నట్లుగా ఆ ఫోన్ నెంబర్ కలిగిన వ్యక్తి తెలిపాడు. అదే సమయంలో పూణే మరియు పింప్రి-చించ్వాడ పరిసరాల్లో తప్పిపోయిన వ్యక్తుల గురించి హింజేవాడి పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో పోలీసులు తప్పిపోయిన వారి ఇళ్ల వద్ద అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరీక్షించారు. ఆ ఫుటేజీలలో వైసీఎం హాస్పిటల్ గేట్ ముందు తప్పిపోయిన బిచ్చగాడు, వాకాడ్ ప్రాంతానికి చెందిన మరో తప్పిపోయిన వ్యక్తి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి మరోవ్యక్తిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. అయితే వాకాడ్ ప్రాంతంలో తప్పిపోయిన వ్యక్తి గురించి పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను ఆరా తీశారు. ఆ వ్యక్తి మెహబూబ్ దస్తగిర్ షేక్ (52) అని తెలిసింది. అతని సూట్‌కేస్ నుంచి పోలీసులు ఒక చిట్టీని స్వాధీనం చేసుకున్నారు. ఆ చిట్టీలో ఎనిమిది మంది పేర్లు ఉన్నాయి. తాను వారి వద్ద రూ. 80 లక్షలు అప్పు చేశానని.. ఇప్పుడు వారందరూ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని నోట్లో పేర్కొన్నాడు. తాను కనిపించకుండా పోయినా లేదా హత్యకు గురైనా వారే బాధ్యులని దస్తగిరి నోట్లో రాశాడు. దాంతో పోలీసులకు దస్తగిరి మరణం మీద అనుమానం కలిగింది. కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే పోలీసులు దౌండ్ రైల్వే స్టేషన్లో దస్తగిరిని గుర్తించారు. తన భర్త తప్పిపోయాడని పోలీసులను తప్పుదోవపట్టించడంలో దస్తగిరి భార్య విఫలమైంది. దస్తగిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచరణ చేయగా.. అసలు విషయం చెప్పాడు. తాను అప్పు చెల్లించలేక.. గుడి ముందు బిచ్చగాడిగా ఉన్న సందీప్ పుండాలిక్ మెయింకర్ హత్యకు ప్రణాళిక వేసినట్లు వెల్లడించాడు. సందీప్‌ను చంపి తానే చనిపోయినట్లు అందరినీ నమ్మించాలనుకున్నట్లు దస్తగిరి పోలీసులకు చెప్పాడు. సందీప్‌ను తన బైక్‌పై ఎక్కించుకొని వేర్వేరు ప్రదేశాలలో తిప్పిన దస్తగిరి.. ఉడాన్ షాహ్వాలి సమీపంలో హత్య చేసి, కాల్చినట్లు ఒప్పుకున్నాడు. ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దస్తగిరిపై మరో కేసు కూడా నమోదైందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దస్తగిరిని పోలీసులు ఐదు రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు.
28 Total Views, 2 Views Today