AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

డబ్బు కోసం కన్నతల్లిని గొంతు నులిమి చంపిన కొడుకు…

1 min read

AABNEWS : కన్న తల్లిని కనికరం లేకుండా చంపి పైగా సహజ మరణంగా నమ్మించడానికి ఆ దుర్మార్గుడు వేయని ఎత్తుల్లేవు. పన్నని పన్నాగాలు లేవు. తొలుత ఆమెను విషం ఇచ్చి చంపుదామనుకున్నాడు. అది పారలేదు. చివరకు ఆమెను గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మెడలోని గొలుసు.. చెవి దిద్దులు.. ముక్కుపోగు సైతం వదల్లేదు.. అన్నీ తీసుకుని ఏమీ ఎరగని వానిలా వెళ్లిపోయాడు. ఇరుగుపొరుగు సమాచారం ఇస్తే.. అమాయకుడిలా ఏడ్చాడు.. తలకొరివి పెట్టాడు. అతని వాలకంపై సందేహం వచ్చిన పెద్ద కొడుకు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. తలకొరివి పెట్టిన కొడుకే ఆ తల్లిని కడతేర్చాడన్న భయంకర నిజం వెలుగుచూసింది. వెంటనే అతన్ని అరెస్టు చేశారు. భద్రాచలం పట్టణంలో యర్రంశెట్టి బసవపార్వతమ్మ ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కొడుకులు వెంకటరత్నంనాయుడు, శ్రీనివాసరావులు ఉన్నారు . వారు వేర్వేరుగా కాపురం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. వృద్ధురాలైన వారి తల్లి బసవపార్వతమ్మ మాత్రం పట్టణంలోని ఓంకార్‌ పండ్ల దుకాణం పైభాగంలో వేసిన రేకుల షెడ్డులో బతుకీడుస్తోంది.ఆమె చిన్నకుమారుడు శ్రీనివాసరావు సుబాబుల్‌ కర్ర కాంట్రాక్టులు చేస్తుంటాడు. వ్యాపారం కోసం భద్రాచలం పట్టణానికి చెందిన రమేష్‌ అనే వ్యక్తి దగ్గర రూ.9 లక్షలు అప్పు చేశాడు. వ్యాపారంలో నష్టపోయాడు. కొంతకాలం అనంతరం రమేష్‌ తన డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో.. ఏంచేయాలో పాలుపోక.. అప్పు పుట్టక.. చివరకు ఒంటరిగా ఉన్న తల్లి వద్దకు చేరాడు. ఆమెను నమ్మించి.. ఆమె తన వాటాకు వచ్చిన ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు నుంచి రూ.9 లక్షలు ఇచ్చింది. నెలనెలా వడ్డీ ఇస్తానని తల్లిని నమ్మించి తీసుకున్న మొత్తానికి మొదటి మూడు నెలలు వడ్డీ చెల్లించాడు. అనంతరం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో శ్రీనివాసరావును తల్లి పిలిపించి మందలించింది. ఈ విషయంలో తనను తల్లి కూడా అర్థం చేసుకోకుండా డబ్బు కోసం ఒత్తిడి చేస్తున్నదన్న కసిని పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా చంపాలని ప్లాన్లు వేశాడు. గతేడాది డిసెంబరు 23వ తేదీ అర్థరాత్రి శ్రీనివాసరావు తల్లి బసవపార్వతమ్మ ఇంటికి వెళ్లాడు. తొలుత విషప్రయోగం చేశాడు. అది బెడిసికొట్టింది. దీంతో ఇక లాభం లేదనుకున్న శ్రీనివాసరావు కన్నతల్లిని గొంతునులిమి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు.. చెవి దిద్దులు.. తల్లికి తాను గతంలో రాసిచ్చిన ప్రామిసరీ నోటు తీసుకుని ఏమీ ఎరుగనట్టు వెళ్లిపోయాడు. తల్లి బంగారం మొత్తాన్ని బాత్‌రూంలో దాచిపెట్టి స్నానం చేసి నిద్రపోయాడు. తెల్లారిన తరువాత తొలుత తానే తల్లి ఉంటున్న గదికి వెళ్లాడు. పరిస్థితిని గమనించి తిరిగి వచ్చేశాడు.అనంతరం చుట్టుపక్కల వాళ్లు ఆమె చనిపోయి ఉన్న విషయాన్ని గమనించి శ్రీనివాసరావుకు ఫోన్‌ ద్వారా తెలిపారు. అమాయకుడిలా నటిస్తూ తన తల్లి బీపీ పెరిగి చనిపోయి ఉంటుందని అందరినీ నమ్మించాడు. ఆమెకు తలకొరివి పెట్టాడు. అయితే తల్లి మరణంపై అనుమానం వచ్చిన పెద్దకుమారుడు వెంకటరత్నం ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు జరిపారు. క్లూస్‌ టీం సేకరించిన వివరాలు.. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హంతకున్ని పట్టుకున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో ‘తన తల్లి సహజమరణం పొందిందని.. ఆమేరకు రిపోర్టులో రాయాలని.. ప్రభుత్వ వైద్యుడిపై శ్రీనివాసరావు ఒత్తిడి తేవడం.. దౌర్జన్యం చేయడం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే అతన్ని అరెస్టు చేశారు. టెంపుల్‌ సిటీలో తల్లిని గొంతు నులిమి చంపిన విషయం వెలుగులోకి రావడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 1,363 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.